గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహణ

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహణ
– పశువైద్యాధికారి డాక్టర్ ఎల్. మానస రెడ్డి
జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి, మార్చి 10: పశువులలో వ్యాపించే గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా ఈరోజు శంకర్‌పల్లి పశువైద్యశాల పరిధిలోని చిన్న శంకర్‌పల్లి మరియు పరవేద గ్రామాలలో పశువులకు నివారణ టీకాలు వేయడం జరిగినట్లు పశువైద్యాధికారి డాక్టర్ ఎల్. మానస రెడ్డి తెలిపారు.
పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు గాలికుంటు వ్యాధి వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఈ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకిన పశువులకు నోటిలో మరియు కాళ్ల గిట్టల్లో పుండ్లు ఏర్పడి తీవ్ర అనారోగ్యానికి గురవడంతో పాటు పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా రైతులకు ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉందని వివరించారు.
అందువల్ల ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా నివారణ టీకాలు వేయించుకోవాలని పశువైద్యాధికారి సూచించారు. ముందస్తు జాగ్రత్త చర్యల ద్వారా మాత్రమే ఈ వ్యాధిని నియంత్రించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొని టీకాల కార్యక్రమానికి సహకరించారు. అలాగే పశువైద్య సిబ్బంది గౌస్, భరత్, రాజ్యలక్ష్మి పాల్గొని పశువులకు టీకాలు అందించారు.
రైతులు తమ పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ పశువైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎల్. మానస రెడ్డి విజ్ఞప్తి చేశారు.
