ఎమ్మెల్సీ రోడ్ షోతో దద్దరిల్లిన కారు గుర్తు ప్రచారం

  • కారు – జోరు – హుషారు

జ్ఞాన తెలంగాణ,అలంపూర్ ఫిబ్రవరి 5 :
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎమ్మెల్సీ రోడ్ షో రాజకీయ వాతావరణాన్ని హోరెత్తించింది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గులాబీ దళంతో కలిసి కారు గుర్తు ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించగా, ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రోడ్ షో సాగిన ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కారు గుర్తుకు మద్దతు ప్రకటించారు.
ఈ రోడ్ షోలో ముఖ్యంగా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 15, 16 వార్డుల ఎస్సీ కాలనీల్లో ప్రజలు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజల ఉత్సాహం, నినాదాలు, గులాబీ జెండాల మధ్య రోడ్ షో విజయవంతంగా కొనసాగింది. కారు గుర్తు ప్రచారం ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలపరిచిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తై మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒక్కదాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రభుత్వానికి మళ్లీ అవకాశం ఇవ్వవద్దని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో వాటి లాభాలు పొందిందని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం చైర్మన్ అభ్యర్థి సీఎం సురేష్ మాట్లాడుతూ, గతంలో తాను 14వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచి సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సమస్యలు లేకుండా అభివృద్ధి చేశానని తెలిపారు. అదే విధంగా అయిజ మున్సిపాలిటీలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి 20 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్ షోను విజయవంతం చేశారు. అయిజ మున్సిపాలిటీలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమనే ధీమా నాయకుల్లో వ్యక్తమవుతోంది.

You may also like...

Translate »