ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్



జనగామ కలెక్టరేట్ , జనవరి 31 జ్ఞాన తెలంగాణ ప్రతినిధి :

ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏఎస్పీ పండారి చేతన్ నితిన్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రహదారి భద్రతపై జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ, ఇతర ప్రధాన రహదారులు కలిసే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్ లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న చోట్లలో ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన మొక్కల కొమ్మలను తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు.హైదరాబాద్ జాతీయ రహదారి, శామీర్పేట్, ఉడుముల ఆసుపత్రి నుంచి యశ్వంతాపూర్, నెల్లుట్ల బ్రిడ్జి వద్ద, రాఘవపూర్ శివారు నుంచి బస్టాండ్ వరకు, ఛాగల్ శివారు నుంచి బస్టాండ్ వరకు పెండింగ్ లో ఉన్న రోడ్డు పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అలాగే జనగామ మున్సిపాలిటీ పరిధిలోని డివైడర్ ల వద్ద, పెంబర్తి, నిడిగొండ, పాలకుర్తి నియోజకవర్గంలోని వావిలాల, మల్లంపల్లి, ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని కరుణాపురం, చిన్న పెండ్యాల గ్రామాల వద్ద, టోల్ గేట్ వద్ద ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా రెయిలింగ్, సీసీ కెమెరాలు, లైటింగ్ ను, రేడియం లైటింగ్ తో హెచ్చరిక బోర్డులను, ప్రమాద సూచిక బోర్డులను, పాదాచారుల క్రాసింగ్ ను ఏర్పాటు చేయాలని, రహదారుల నుంచి నిర్దేశిత దూరం పాటించే విధంగా మద్యం దుకాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్, రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు.అదే విధంగా ప్రమాదాలు జరగకుండా ఎన్జీఓల సహకారంతో బ్యారీకేడ్ లను ఏర్పాటు చేయాలని, జిల్లాలో 90 శాతం మేర ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలు జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని, పోలీసు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా పాఠశాలల, కళాశాలల బస్ చోదకులతో సమావేశాలను నిర్వహించి, అవగాహన కల్పించాలని, అలాగే ప్రత్యేక డ్రైవ్ ద్వారా శిరస్త్రాణం లేని ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించాలని, మైనర్ లు ద్విచక్ర వాహనం నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదవుతాయని స్పష్టం చేశారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రవాణా అధికారి జీవి. శ్రీనివాస్ గౌడ్, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఘనపూర్ (స్టేషన్) ఏసీపీ భీం శర్మ, సంబంధిత జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »