తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్
కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన పర్యటన శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశముందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. బాధితులను పరామర్శించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో హైదరాబాద్‌లోని నివాసంలోనే నిర్బంధించారు.
శనివారం కామారెడ్డిలో భూవివాదంపై మొదలైన ఆరోపణలు తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భూకబ్జా ఆరోపణలు చేయడంతో వివాదం ముదిరింది. ఈ ఆరోపణలను నిరూపించాలంటూ ఎమ్మెల్యే సవాల్ విసరడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి, బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు చేరుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఆగ్రహంతో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నేతకు చెందిన వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు దాడులకు పాల్పడ్డారు.
పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. ఇరువర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల మధ్య రాంచందర్ రావు పర్యటన ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని అంచనా వేసిన పోలీసులు ఆయన్ను కూడా హౌస్ అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ చర్యపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
