రైతు భరోసా మూడో విడత విడుదల
- స్పీడ్ పోస్ట్‌తో గంజాయి దందా బట్టబయలు - July 2, 2026
- రైతు భరోసా మూడో విడత విడుదల - July 2, 2026
- హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు - July 2, 2026

- రూ.1,330 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ
- 3–4 ఎకరాల రైతులకు ప్రాధాన్యత
- 6.39 లక్షల మంది రైతులకు లబ్ధి
- డీబీటీ ద్వారా పారదర్శకంగా నిధుల పంపిణీ
- మొత్తం రూ.5,402 కోట్ల సాయం అందించిన ప్రభుత్వం
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో భాగంగా 3 నుంచి 4 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ప్రాధాన్యతనిస్తూ రూ.1,330 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. వర్షాకాల సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన పెట్టుబడి సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయడంతో పాటు సాగు ఖర్చులను భరించేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు అప్పుల భారం తగ్గించుకుని ఆత్మవిశ్వాసంతో సాగు పనులు ప్రారంభించేందుకు ఈ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా పథకం అమలులో పూర్తిస్థాయి పారదర్శకత పాటిస్తున్నామని, అర్హులైన రైతులందరికీ ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో నిధులు జమ చేస్తున్నామని మంత్రి వివరించారు. తాజా విడతతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 61.35 లక్షల మంది రైతులకు మొత్తం రూ.5,402 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, పెట్టుబడి కోసం అప్పులపై ఆధారపడకుండా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో రైతు భరోసా పథకం కీలక పాత్ర పోషిస్తోందని, రానున్న రోజుల్లో కూడా రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది
