అంగన్వాడీల్లో పోస్టులు – మంత్రి సీతక్క

తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీ సేవలను శక్తివంతం చేయడానికి పెద్ద ఎత్తున నియామకాలకు కసరత్తు మొదలైంది. మొత్తం 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయిలో మహిళలు, పిల్లల ఆరోగ్యం, పోషణలో కీలక పాత్ర పోషించే అంగన్వాడీలను మరింత బలపరిచే దిశగా ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) అభ్యర్థులకు 100% రిజర్వేషన్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు విధించిన స్టే ఎత్తివేయేందుకు వెంటనే వెకేట్ పిటిషన్ దాఖలు చేయాలని మంత్రి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ సేవలను స్థానికులే సమర్థంగా నిర్వహించగలరన్న అభిప్రాయంతో ఈ రిజర్వేషన్ అమలు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. తొందరలోనే న్యాయపరమైన సమస్యలను అధిగమించి స్థానిక గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం.
అదే సమయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ నిబంధన వర్తించట్లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తెలంగాణలో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని సీతక్క స్పష్టం చేశారు. అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల నియామకాలు పారదర్శకంగా జరిగి, సామాజిక న్యాయం సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ చర్యలు అమల్లోకి వస్తే, పల్లెల్లో సేవల నాణ్యత పెరగడంతో పాటు వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
