రైతుల భూముల దోపిడీపై డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పోరాటం

- 70 ఏళ్ల రైతు శ్రమను తుడిచిపెట్టే పాలన
- అభివృద్ధి ముసుగులో పేదల భూముల లూటీ
- భూమి లాక్కుంటే జీవితం లాక్కున్నట్టే
- లగచర్లకు న్యాయం… రేగడి దోస్వాడకు ఎందుకు అన్యాయం?
- పట్టా భూములతో సమానంగా ఎకరాకు రూ.1.20 కోట్లు ఇవ్వాలి
- రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానం
- బీఆర్ఎస్ రైతుల కవచం
- న్యాయం దక్కే వరకు పోరాటం ఆగదు
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యురో:
షాబాద్ మండలం రేగడి దోస్వాడ గ్రామంలో పేద రైతుల భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అదనపు డీజీపీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 70 ఏళ్లుగా తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఎస్సీ అసైన్డ్ భూములకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వకుండా, ఇప్పుడు అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ, ల్యాండ్ పూలింగ్ పేర్లతో ఆ భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించడం చట్టవిరుద్ధమే కాకుండా అమానుషమని ఆయన స్పష్టం చేశారు. రైతు భూమి ఆస్తి కాదని, అదే జీవితం అని చెబుతూ, రైతుల శ్రమ, రక్తం, చెమటతో సస్యశ్యామలమైన భూములను “ప్రభుత్వ భూములు” అంటూ ముద్రవేసి అతి తక్కువ ధరకు స్వాధీనం చేసుకోవడం రైతుల జీవనాధారంపై నేరుగా దాడి చేసినట్టేనని మండిపడ్డారు. మార్కెట్ విలువ కోట్లలో ఉన్న భూములను కేవలం రూ.26 లక్షలకు కొట్టేయాలని చూడటం రైతులను మోసం చేయడమేనని, ఇది 2013 భూ సేకరణ చట్ట స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు. లగచర్ల ప్రాంతంలో గతంలో రూ.2 లక్షల విలువ ఉన్న భూములకు ప్రభుత్వం రూ.20–25 లక్షల వరకు పరిహారం ఇచ్చిన ఉదాహరణను గుర్తు చేస్తూ, అదే న్యాయం రేగడి దోస్వాడ రైతులకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. భూమి విలువ కనీసం రూ.7 లక్షలు ఉంటే, దానికంటే ఎక్కువే రావాలని, పట్టా భూములతో సమానంగా లెక్కిస్తే ఒక్క ఎకరానికి కనీసం రూ.1.20 కోట్లు పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల అనుమతి లేకుండా, సరైన పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కోవాలని చూడటం ప్రభుత్వ దుర్మార్గపు విధానానికి నిదర్శనమని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లుగా రైతులు సాగు చేస్తున్న భూములకు ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకపోవడం పాలకుల వైఫల్యమేనని, గత ప్రభుత్వాల తప్పులకు నేటి రైతులు బలికావాలా అని ప్రశ్నించారు. చట్టబద్ధమైన హక్కులు కల్పించకుండా, ఇప్పుడు అభివృద్ధి పేరుతో భూములు లాక్కోవడం రైతుల జీవితాలపై ప్రభుత్వమే దాడి చేసినట్టేనని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నట్లు చెప్పుకుంటూనే, భూముల విషయంలో మాత్రం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు పట్టాలు ఇవ్వకుండా, భూముల విలువను తగ్గించి చూపిస్తూ తక్కువ పరిహారంతో సరిపెట్టాలనుకోవడం మోసపూరిత రాజకీయమని, ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతుల మెడలపై కత్తి పెట్టినట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈశా ఫౌండేషన్ కోసం భూములు ఇవ్వడానికి పేదల భూములే దొరికాయా అని ప్రశ్నిస్తూ, ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలు కేటాయించవచ్చు కదా అని నిలదీశారు. ధనవంతులు విశ్రాంతి తీసుకునే ఆశ్రమాల కోసం పేద ఎస్సీల భూములు ఎందుకు కావాలని ప్రశ్నిస్తూ, ఈశా ఫౌండేషన్ వల్ల ఇక్కడి పేదలకు ఏ లాభం జరుగుతుందని, ఉద్యోగాలిస్తారా, చదువు చెప్తారా, ఆసుపత్రులు కడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ పాలనలో పేదలకు కేసీఆర్ కిట్, గురుకులాలు, మూడు ఎకరాల భూమి, దళిత బంధు వంటి పథకాల ద్వారా ఆర్థిక భద్రత కల్పించారని గుర్తు చేస్తూ, పేదలను వ్యాపారస్తులుగా, స్వావలంబులుగా మార్చాలన్న దృష్టితో కేసీఆర్ పనిచేశారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల భూములు లాక్కొని వారిని నిరాశ్రయులుగా, అడ్డాకూలీలుగా మార్చాలని చూస్తోందని తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి కంపెనీల కోసం అందుబాటులో ఉన్నప్పటికీ, ఎస్సీల భూములనే లక్ష్యంగా చేసుకోవడం దురుద్దేశపూరితమని అన్నారు. ఎన్నికల ముందు పేదల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చేవెళ్ల సాక్షిగా మల్లికార్జున ఖర్గే సమక్షంలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూములు లాక్కోవాలని చూసారని, ఇప్పుడు సద్గురు కోసం ఎస్సీల భూములు లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి సంతకం పేదలకు వ్యతిరేకంగానే ఉందని, సెక్రటేరియట్ నుంచి తీసుకునే ప్రతి నిర్ణయం పేదల పొట్ట కొట్టడానికేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినందుకు, మహిళా ఐఏఎస్ అధికారిని గురించి ప్రచారంపై ప్రశ్నించినందుకు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి గంటల తరబడి విచారణ పేరుతో వేధించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు వెంటనే పట్టా పుస్తకాలు జారీ చేసి, పేదలకు భూములపై సర్వ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.
షాబాద్ మండలంలోని రేగడి దోస్వాడ, మక్తగూడెం, వెంకన్నగూడెం, తాళ్లపల్లి, తిమ్మారెడ్డిగూడెం గ్రామాల భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తే లగచర్ల స్ఫూర్తితో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమి మార్కెట్ విలువకు మూడు రెట్లు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని, అంతేకాదు భూమికి బదులు భూమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పేదలకు న్యాయం జరిగేదాకా పోరాడతామని స్పష్టం చేశారు. 70 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్న రైతులను అకస్మాత్తుగా వెళ్లిపోమంటే ఎలా వెళ్తారని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం రైతులను చంపి భూములుగా లాక్కోవాలని చూస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులు ఒంటరిగా లేరని, వారి భూములు, హక్కులు కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, అవసరమైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో లగచర్ల వలే ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా విన్న డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఈ భూ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం న్యాయం దక్కే వరకు ఆగదని స్పష్టంగా ప్రకటించారు.




