రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు?

కొత్త పన్ను విధానం మీకు లాభదాయకమా?
కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. మంగళ వారం నుంచే కొత్త ఆదాయపు పన్ను విధానం (న్యూ ట్యాక్స్ రిజీమ్) మరియు పాత ఆదాయపు పన్ను విధానం (ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్)లో బడ్జెట్ 2025లో చేసిన మార్పులు అమల్లోకి వచ్చాయి.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్నును రద్దు చేసిన విషయం తెలిసిందే.అదే సమయంలో, పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఇప్పుడు పాత పన్ను విధానం మంచిదా లేక కొత్త పన్ను విధానం మంచిదా అనే ప్రశ్న తలెత్తుతోంది.అలాగే, కొత్త పన్ను విధా నంలో ఏ విధంగా పన్ను ఆదా చేయవచ్చు.. పన్ను చెల్లింపుదారులకు ఎంత మొత్తం ప్రయోజనం చేకూ రనుంది అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసు కుందాం…
కొత్త పన్ను విధానం ప్రకారం,రూ.4 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. రూ.4,00,001 నుంచి రూ.8,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి 5 శాతం పన్ను వర్తిస్తుంది.
రూ.8,00,001 నుంచి రూ.12,00,000 వరకు ఆదాయం ఉన్నవారు 10 శాతం పన్ను చెల్లించాలి. రూ.12,00,001 నుంచి రూ.16,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి 15 శాతం, రూ.16,00,001 నుంచి రూ.20,00,000 వరకు ఆదాయం ఉన్న వారికి 20 శాతం చెల్లించవలసి ఉంటుంది…
రూ.20,00,001 నుంచి రూ.24,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి 25 శాతం , రూ.24,00,001 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను వర్తిస్తుంది.