తెలంగాణలో జాతీయ క్రీడలు నిర్వహించండి

  • ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో రేవంత్ భేటీ
  • తెలంగాణలో జాతీయ క్రీడలు నిర్వహించాలని విజ్ఞప్తి
  • ‘ఖేలో ఇండియా’, ‘40వ జాతీయ క్రీడలు’ రాష్ట్రానికి కేటాయించాలని కోరిక
  • క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని మనవి
  • క్రీడాకారులకు రైలు ఛార్జీల రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్

జ్ఞానతెలంగాణ,ఢిల్లీ ప్రతినిధి :

తెలంగాణలో క్రీడారంగానికి పెద్దపీట వేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో సమావేశమయ్యారు. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మార్చేందుకు అవకాశం కల్పించాలని ఈ భేటీలో ఆయన కేంద్రమంత్రిని కోరారు.
రాష్ట్రంలో ‘ఖేలో ఇండియా’తో పాటు ప్రతిష్ఠాత్మకమైన 40వ జాతీయ క్రీడలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ విన్నవించారు. ఈ మెగా ఈవెంట్ల నిర్వహణకు తెలంగాణ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. క్రీడల నిర్వహణకు అవసరమైన శిక్షణ, వసతుల కల్పన కోసం ‘ఖేలో ఇండియా’ పథకం కింద ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు.
అదేవిధంగా, జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లే క్రీడాకారులకు గతంలో రైలు ఛార్జీల్లో అందిస్తున్న రాయితీని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఎందరో క్రీడాకారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

You may also like...

Translate »