మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా మణిక విశ్వకర్మ

- మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేతగా రాజస్థాన్ యువతి
- జైపూర్‌లో ఘనంగా జరిగిన తుది పోటీలు
- థాయ్‌లాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం
- ఫస్ట్ రన్నరప్‌గా తాన్యా శర్మ, సెకండ్ రన్నరప్‌గా మెహక్ ధింగ్రా
ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మను వరించింది. సోమవారం రాత్రి జైపూర్‌లో అట్టహాసంగా జరిగిన ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచారు. గత ఏడాది విజేత రియా సింఘా, మణికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మణిక ఈ ఏడాది నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఇదే పోటీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, హర్యానాకు చెందిన మెహక్ ధింగ్రా సెకండ్ రన్నరప్‌గా, అమిషి కౌశిక్ థర్డ్ రన్నరప్‌గా నిలిచారు.
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో చివరి సంవత్సరం చదువుతున్న ఆమె, చిన్న వయసులోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఆమె శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. పెయింటింగ్‌లోనూ అద్భుతమైన నైపుణ్యం ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘బిమ్స్టెక్ సెవోకాన్’ కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. లలిత కళా అకాడమీ, జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి కూడా గౌరవాలు అందుకున్నారు.
కేవలం కళలు, చదువుకే పరిమితం కాకుండా, సామాజిక అంశాలపై కూడా మణిక ప్రత్యేక దృష్టి సారించారు. న్యూరోడైవర్జెన్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘న్యూరోనోవా’ అనే సంస్థను ఆమె స్థాపించారు. ఏడీహెచ్‌డీ వంటి సమస్యలను లోపాలుగా కాకుండా, ప్రత్యేకమైన మేధోశక్తులుగా చూడాలని ఆమె తన ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.
విజయం అనంతరం మణిక మాట్లాడుతూ.. “నా ప్రస్థానం నా సొంత ఊరు గంగానగర్ నుంచి మొదలైంది. ఢిల్లీ వచ్చి ఈ పోటీల కోసం సిద్ధమయ్యాను. మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచుకోవాలి. నా ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. నాకు సహాయం చేసి, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పోటీలు కేవలం ఒక రంగం కాదు, అవి వ్యక్తిత్వాన్ని నిర్మించే ఒక ప్రపంచం” అని ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారుఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. జైపుర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ పోటీల్లో ఆమె గెలుపొందారు. 2024 మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా.. మణికకు కిరీటాన్ని అలంకరించారు.ఈ ఏడాది నవంబర్ లో థాయిలాండ్ లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున మణిక ప్రాతినిధ్యం వహించనున్నారు.