“బోధానంద లాంటి పదిమంది భిక్షువులు భారతదేశంలో ఉండి ఉంటే దేశం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు.” బాబాసాహెబ్ డా.అంబేడ్కర్
బోధానంద బౌద్ధ భిక్షువు, బౌద్ధ ధమ్మ వ్యాప్తికి కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ మరియు భంతే చంద్రమణికు చాలా సన్నిహితులు. బోధానంద బౌద్ధ పండితుడు, సామాజిక కార్యకర్తగా,రచయితగా సమాజ పరివర్తన కొరకు కృషి చేశారు.సమాజ పురోగతికి బాటలు వేసే గొప్ప వ్యక్తులలో బోధానంద ఒకరు.
జననం : 1874 వ సం.రం జనవరి 13 న చునార్ (వారణాసి) లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.బోధానంద మొదట్లో సాధువులకు,యోగులకు సేవలు చేస్తూ గడిపారు.సమాజంలో అసమానతలను చూసి చలించారు.దళితులు, వెనుకబడిన జాతులు శతాబ్దాలుగా దుక్ఖంలో ఉండటానికి గల కారణం బ్రాహ్మణిజం ఆధిపత్యంలో గల హిందూమతం కారణం అని గమనించిన తరువాత హిందూ మత గ్రంథాలను అధ్యయనం చేశారు.
“నేను హిందూ గ్రంథాలను, హిందూ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేశాను.కానీ నాకు అవేమీ మనఃశ్శాంతిని ఇవ్వలేదు. హిందూ మతం మెజారిటీ ప్రజలైన శూద్రులు మరియు అంటరాని వారిని దయనీయమైన స్థితిలో ఉంచి భయంకరమైన జన్మ ఆధారిత వర్ణ వ్యవస్థను కలిగి ఉందని నేను గ్రహించాను.శూద్రులు, దళితులు మత,సామాజిక, రాజకీయ,ఆర్థిక మరియు విద్యా రంగాలలో ఎదుగుదల లేకుండా పురోగతి చెందకుండా అన్ని మార్గాలను కోల్పోయారు. వారికి మానవ హక్కులు కూడా లేకుండా వారి ఆకాంక్షల కనికరం లేకుండా కుటిలంగా అణచివేయబడ్డాయి.అగ్రవర్ణాలకు చెందిన హిందువులు పుట్టుక ఆధారిత వర్ణ వ్యవస్థ నుండి అనవసర ప్రయోజనాలను పొందుతున్నారు. అణగారిన వర్గాల శ్రమతో జీవిస్తున్నారు. వారి దయనీయమైన పరిస్థితి చూసి నేను చాలా కలత చెందాను,బాధపడ్డాను.” అని బోధానంద చెప్పారు. ఈ అనుభవాలు మిలింద పన్హ గ్రంథంలో పేర్కొన్న భిక్ఖు నాగసేన అనుభవించినట్లే ఉన్నాయి.
పుట్టుక రిత్యా బ్రాహ్మణుడైనా బోధానంద సత్యాన్ని సత్యంగా గ్రహించి బ్రాహ్మణిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బౌద్ధ మతాన్ని తన మతంగా బోధానంద స్వీకరించారు.1916 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ‘భారతీయ బౌద్ధ సమితి’ ను స్థాపించారు.బోధానంద గ్రామగ్రామాన తిరిగి బుద్ధుని బోధనలు గురించి జనాలకు వివరించారు.ఈనాడు బౌద్ధ భిక్షువులు అంటూ కొందరు సోమరిపోతులు బుద్ధ విహారాలను దాతల ఆర్థిక సహాయంతో కట్టించుకొని బ్యాంకు అకౌంట్ లో డబ్బులు వేయించుకొని ధమ్మాన్ని ప్రచారం చేయకుండా ఆ విహారాలలో ఏసీ గదులు, పని మనుషులను పెట్టుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి భిక్షువులు వలనే ధమ్మం వ్యాపించడం లేదు. ఉపాసకులు కొందరు ఇలాంటి వారిని బాగా ఆదరిస్తున్నారు. ఫలితంగా సమాజంలో ధమ్మ వ్యాప్తి లేదు.
గ్రంథాలయం స్థాపన : బోధానంద బౌద్ధ మతం, తత్వశాస్త్రం, చరిత్ర, పురావస్తు శాస్త్రం, పాళీ, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ భాషలలోని అరుదుగా లభించే బౌద్ధ పుస్తకాలను సేకరించి బీహార్ లో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. వేదాలకు పూర్వం అనంతర భారతీయ సంస్కృతి, నాగరికత, కళలు, విదేశీ యాత్రికుల ప్రయాణ కథనాలను, పురావస్తు ఆవిష్కరణల గురించిన గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి.
వెనుకబడిన మరియు దళితులు కోసం బోధానంద కృషి : 1930 నాటికి బోధానంద వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేశారు. వెనుకబడిన తరగతుల మరియు దళితులను విద్యావంతులుగా చేయాలని ఉద్యమాన్ని నడిపారు. ఈ ప్రజలు విద్యావంతులు అయితే అభివృద్ధి చెందిన తరువాత సామాజిక బాధ్యతలు నెరవేరుస్తారని బోధానంద ఆశించారు.వెనుకబడిన తరగతులకు చెందిన మేధావులు, ఆలోచనాపరులు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, సంస్కర్తలను కలిసి బోధానంద వీరందరినీ ఒక వేదికపైకి తీసుకుని వచ్చారు.
రచయితగా బోధానంద : బోదానంద గొప్ప రచయిత 1930లో మూన్ భారతవాసి ఔర్ ఆర్య పుస్తకాన్ని ప్రచురించారు ఈ పుస్తకం 2005లో రెండవ ఎడిషన్ ఆనంద్ సాహిత్య సదన్ నుండి వెలబడింది ఇటీవల ఢిల్లీలోని సమ్మె ప్రకాశం వారు కూడా ఈ పుస్తకాన్ని ప్రచురించారు సవర్ణుల మతం సంస్కృతి ప్రవర్తన మరియు ఆహారపు అలవాట్లపై పరిశోధన ఆధారంగా రూపొందించబడింది ఆర్యులు భారతదేశానికి వలస వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అసలు మూల నివాసులతో కలవని గ్రహాంతర వాసులని ఈ పుస్తకంలో బోధనంద నిర్ధారించారు అసలు మూల నివాసుల సంస్కృతి మరియు నాగరికతలో ఆర్యులు ఎప్పటికీ భాగం కాలేదు అంతేకాదు వారు అసలు మూల నివాసులతో విభాగాలను కూడా కలిగి ఉన్నారు అది హింసాత్మకంగా మారింది చాలా కాలం పాటు కొనసాగింది.బ్రాహ్మణ వాదులు వేల సంవత్సరాలు నుండి. దాచి ఉంచిన సత్యాన్ని ఈ పుస్తకం బట్టబయలు చేసింది. ఈ పుస్తకం వెనుకబడిన తరగతుల మరియు దళితులు తప్పనిసరిగా చదవలసిన పుస్తకం. ఈ పుస్తకం ఆర్యులు మరియు మూలవాసులు వేర్వేరు జాతులు వారని వాదిస్తూ భారతీయ పండితుడు చేసిన తొలి పరిశోధన అని చెప్పవచ్చు.
బుద్ధ విహార్ స్థాపన : లక్నోలోని మహాబోధి సౌసైటీకు అనుబంధంగా ఉన్న రిసల్దార్ పార్క్, బుద్ధ విహార్ ను బోధానంద నిర్మించారు. శ్రీలంక దేశం నుండి మన భారతదేశంలో తిరిగి బౌద్ధ మతాన్ని పునరుద్ధరించడానికి బోధానంద తిరిగి వచ్చారు. లక్నోలోని భిక్ఖు కృపాసరన్ మరియు బోధిసత్త్వ విహార్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.ఈ బౌద్ధ విహార్ దళిత బహుజన మరియు బౌద్ధ కార్యకలాపాలకు ఒక వేదిక. బాబాసాహెబ్ అంబేడ్కర్ 1932 లో ఒకసారి,1948 లో రెండు సార్లు ఈ విహార్ లో ఉన్నారు.
బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ మరియు బోధానంద : బాబాసాహెబ్ అంబేడ్కర్ భంతే బోధానందను 1920 లో లక్నోలో కలుసుకున్నారు. వీరి మధ్య అప్పటి నుండి ధమ్మ మైత్రి ఉంది. తరుచుగా బాబాసాహెబ్ బోధానందను కలిసేవారు.భంతే బోధానందకు బాబాసాహెబ్ అంటే చాలా ఇష్టం. బాబాసాహెబ్ రెండో వివాహం తరువాత తాను బౌద్ధం స్వీకరించాలనే నిర్ణయాన్ని బోధానందకు తెలియచేయగా బోధానంద ఏమి జరుగుతుందో అని చమత్కరించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ స్థిరంగా ఉంటానని బాబాసాహెబ్ సమాధానం ఇచ్చారు. చంద్రబాబాగా పేరొందిన మహాస్తవిర చంద్రమణికు బోధానంద సన్నిహితులు.భంతే చంద్రమణి బౌద్ధ మహావీర్ బాబా ప్రేరణతో కుసీనగర్ లో ధమ్మ వ్యాప్తికి పనిచేశారు.
బోధానంద మరియు రాహుల్ సాంకృత్యాయన్ : రాహుల్ జీ మహాస్తవీర్ బోధానంద యొక్క చిన్న జీవిత చరిత్ర పుస్తకంలో బోధానంద తనకు బౌద్ధమతాన్ని పరిచయం చేశారని వ్రాశారు. ఇది 1917లో జరిగింది. అతను భంతే బోధానందను క్రమం తప్పకుండా కలుసుకున్నాడు. బోధానందను శ్రీలంక సన్యాసుల ద్వారా వాసల్సుట్టా పరిచయం చేసినప్పుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
భంతే బోధానంద 1952 మే 11 న పరినిర్వాణం చెందారు.బోధానంద వంటి బౌద్ధ భిక్షువులు నేడు లేరు.మన సమాజంలో ఇప్పుడు తిరుగుతున్న భిక్షువులు, ఉపాసకులు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పరితపిస్తున్నారు.ముఠాలు కడుతున్నారు.కులవాదులుగా మారి నిజాయితీగా ధమ్మ వ్యాప్తికి పనిచేసే వారిని టార్గెట్ మరియు టార్చర్ చేసేవారు ఉన్నారు.ధమ్మ వ్యాప్తికి పనిచేసే భార్యాభర్తలు మధ్య చిచ్చు పెట్టి జంటలను విడదీయాలని చూసే భిక్షువు, ఉపాసకులు కూడా ఉన్నారు.ఇలాంటి దగుల్భాజీలు, అహంకారం గల దుర్మార్గులు ఉన్నారు. పైకి పంచశీల కండువాలు వేసుకొని ఇంట్లో క్రైస్తవ మనువాదాన్ని ఆచరిస్తూ ధమ్మానికి తీరని ద్రోహం చేస్తున్నారు.