మతం నియంత్రణ, దోపిడీ, విభజన చేస్తున్నది – సమతా సైనిక్ దళ్

“Religion has been used as a means of controlling people, of exploiting people, of dividing people.”
— జిడ్డు కృష్ణమూర్తి (The First and Last Freedom, page 125)


జిడ్డు కృష్ణమూర్తి మతాన్ని వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభూతిగా కాకుండా, అది సామాజికంగా ఎలా ఉపయోగించబడుతుందో హేతుబద్ధంగా విశ్లేషించారు. ఆయన అభిప్రాయంలో, మతం స్వతంత్రమైన వ్యక్తిగత విశ్వాసంగా ఉంటే అది ఒక మానసిక వికాస సాధనంగా మారుతుంది. కానీ, చరిత్రను పరిశీలిస్తే, మతాన్ని ఎక్కువగా శక్తి కేంద్రాలుగా ఉపయోగించి ప్రజలను నియంత్రించేందుకు, దోపిడీ చేయటానికి, విభజించేందుకు వినియోగించారని స్పష్టమవుతుంది.

మతం ఒక నియంత్రణ సాధనం:
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే, మతాన్ని ప్రజల ప్రవర్తనను నియంత్రించేందుకు ఉపయోగించిన అనేక ఉదాహరణలు కనిపిస్తాయి.

ఎ. మతశాస్త్రాల ద్వారా నియంత్రణ:
మత గ్రంథాలు ప్రజల ప్రవర్తనను నియంత్రించేందుకు ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు, హిందూ మతంలో మనుస్మృతి లాంటి గ్రంథాలు ఎస్సీ ఎస్టీ బీసీలను సామాజికంగా నియంత్రించడం కోసం రచించబడ్డాయని అర్థమవుతుంది.

కులవ్యవస్థను న్యాయబద్ధంగా చేయడానికి మతాన్ని అడ్డుగా పెట్టుకున్నారు. రాజులు, బ్రాహ్మణులు, మతపెద్దలు మతాన్ని ఉపయోగించి తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకున్నారు. ఈ విధంగా, మతం శక్తివంతుల చేతిలో ఒక శాసన సాధనంగా మారింది.

బి. మత సంబంధమైన భయాలు:
మత ప్రచారంలో ప్రధానంగా రెండు భయాలను ప్రోత్సహించారు:
పరలోకం, నరలోక భయం: మరణానంతరం జరిగే ఫలితాల గురించి భయపెట్టి, ప్రజలను మత నియమాలకు లోబరచారు.
అసహనం భయం: మతపరంగా ప్రశ్నించే వారిని శిక్షిస్తూ, సమాజంలో స్వేచ్ఛా భావాలను అణచివేశారు.
మధ్యయుగ ఐరోపాలో క్రైస్తవ చర్చి విచారణ అనే పాప పరిహారపు పత్రం ద్వారా ఏకచింతనను నిర్బంధించింది. ఇప్పుడు హిందూ మతం పుష్కరాలు పేరుతో పాపాలను కడుక్కోవచ్చు. బట్టలు మురుకైతే, ఏ విధంగా ఉతికి శుభ్రం చేసుకుంటామో, అలాగే అనేక భయంకరమైన నేరాలు చేసినప్పటికీ గంగలో మునిగితే పాపాలన్నీ కొట్టుకుపోతాయి పుణ్యఫలాలు వస్తాయి అని ప్రజలను మభ్యపెట్టి ఆర్థిక దోపిడికి గురి చేయడమే

మతం ఒక దోపిడీ సాధనం:
మతం సామాజిక అణచివేతకు, సంపద, అధికారాల దోపిడీకి ఓ సాధనంగా ఉపయోగించబడింది.

ఎ. ఆర్థిక దోపిడీ: దేవాలయాల ద్వారా ప్రజల నుంచి భారీగా విరాళాలు, ధన సంపాదన జరిపారు. కొన్ని మతాల్లో ధనాన్ని మత గురువుల ఆధీనంలో ఉంచే విధానాన్ని ప్రోత్సహించారు.
మధ్యయుగ యూరప్‌లో క్రైస్తవ చర్చి భూస్వామ్య వ్యవస్థను నియంత్రించింది. దశమ భాగాల పేరుతో పాస్టర్లు చేసే దోపిడీ అంతా ఇంతా కాదు.

బి. సామాజిక దోపిడీ: కులవ్యవస్థ ద్వారా శ్రమ విభజన చేసి, ఓ వర్గాన్ని శాశ్వతంగా అణచివేశారు. ముస్లిం, క్రైస్తవ మతాల్లోనూ మత గురువుల ఆధిపత్యాన్ని ప్రశ్నించేవారిపై తీవ్రమైన నియంత్రణ అమలుచేశారు.

మతం ఒక విభజన సాధనం:
మతం ప్రజలను ఏకతాటిపై ఉంచే సాధనంగా కాకుండా, వారిని విభజించేందుకు ఎక్కువగా ఉపయోగించబడింది.

ఎ. మతపరమైన యుద్ధాలు:
శతాబ్దాల పాటు కొనసాగిన క్రైస్తవ క్రూసేడ్లు యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ మధ్య మతపరమైన పోరాటాలే.
భారతదేశంలో హిందూ-ముస్లిం సంఘర్షణలు మతపరమైన విభజనల ఫలితమే.

బి. మతరాజకీయాలు: భారతదేశ విభజన మతపరమైన రాజకీయాల ద్వారా సాగిన చారిత్రక సంఘటన.
నేటికీ ఆర్ఎస్ఎస్ బిజెపి మతపరమైన రాజకీయాలు చేస్తున్నాయి, ప్రజలను విభజించి, ఓట్ల కోసం మతాన్ని ఉపయోగించుకుంటున్నారు.

మతాన్ని హేతుబద్ధంగా చూడాల్సిన అవసరం: బౌద్ధ ఒక నియంత్రణ వ్యవస్థగా కాకుండా, వ్యక్తిగత అన్వేషణగా, పంచశీల ద్వారా నైతికత ప్రవర్తన నేర్చుకునేదిగా, ప్రజలను సమైఖ్యపరిచేదిగా ఉంది.

హేతుబద్ధంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మతపరమైన ప్రచారాలను మూసగా అంగీకరించకుండా, పరిశీలన చేయాలి.

మతాన్ని ఏకపక్షంగా చూడకూడదు. అది నైతికతను పెంచే సాధనంగా ఉండాలి కానీ, నియంత్రణ, దోపిడీ, విభజన సాధనంగా మారకూడదు. మతపరమైన హింస, సామాజిక అన్యాయాలను ప్రశ్నించాలి. మతాన్ని వ్యక్తిగత జ్ఞాన సాధనంగా చూడాలి, కానీ సమాజాన్ని అదుపు చేసేందుకు దాన్ని అడ్డుపెట్టుకోకూడదు.

“స్వేచ్ఛ అనేది మతాన్ని అనుసరించటంలో కాదు, మతపరమైన భయాల నుండి విముక్తి పొందటంలో ఉంది.”జిడ్డు కృష్ణమూర్తి.



బేతాళ సుదర్శనం

భారతీయ బౌద్ధ మహాసభ, సమతా సైనిక్ దళ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు

You may also like...

Translate »