ఒక్క తెలంగాణలోనే రూ.7 కోట్లు ఎందుకు? కేటీఆర్

- మెగావాట్‌కు రూ.7 కోట్లు… ఇది స్కాం కాదా?
- సింగరేణిలో అవినీతి బయటపడితే పాలకుల్లో వణుకు?
- పేలుడు పదార్థాలపై 30% ధరలు ఎందుకు పెంచారు?.
- ప్రశ్నించిన డైరెక్టర్లపై చర్యలు – కాంట్రాక్టర్లకు లాభాలా?
- ప్రజాధనమే దోచుకుంటున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు
జ్ఞానతెలంగాణ,సెట్ డెస్క్ :
తెలంగాణలో సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల లోపే పూర్తవుతుంటే, ఒక్క తెలంగాణలోనే సింగరేణి కాలరీస్ పిలిచిన సోలార్ టెండర్లలో మెగావాట్‌కు రూ.7 కోట్లు ఖర్చవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న మార్కెట్ రేట్లకు ఇది పూర్తిగా విరుద్ధమని, మరి ఒక్క తెలంగాణలోనే ఈ భారీ వ్యయం ఎందుకు అవుతోందని నిలదీశారు. ఇది స్పష్టమైన సోలార్ పవర్ స్కాం కాదా అని ప్రశ్నించినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సింగరేణిలో జరుగుతున్న అవినీతి బయటకు రావడంతో పాలకులలో వణుకు మొదలైందని కేటీఆర్ ఆరోపించారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలపై ఇప్పటికే బీఆర్ఎస్ పోరాటం చేస్తుండగా, తాజాగా సోలార్ పవర్ స్కాం అంశాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి సవివరమైన ఫిర్యాదు అందజేశారు. సింగరేణి సంస్థలో జరుగుతున్న అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, కాంట్రాక్టర్లకు అక్రమంగా లాభాలు చేకూరుస్తున్న అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడిన కేటీఆర్, సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో ధరలు ఎందుకు మూడు రెట్లు పెరిగాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఒకే టెక్నాలజీ, ఒకే సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లు నిర్మించేటప్పుడు ఖర్చు తక్కువగా ఉంటే, తెలంగాణలో మాత్రం అంత అధికంగా ఎలా అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ అంశాన్ని అడిగినప్పుడల్లా పాలకులు మౌనం పాటిస్తున్నారని, ఇది ప్రభుత్వానికి ఈ స్కాంలో ఉన్న పాత్రను స్పష్టంగా చూపిస్తోందని కేటీఆర్ విమర్శించారు.
సోలార్ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా సింగరేణి గనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్ ధరలను కూడా ఏకంగా 30 శాతం పెంచారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ధరల పెంపు వెనుక ఎలాంటి న్యాయమైన కారణం లేదని ఆయన అన్నారు. ఎందుకు 30 శాతం పెంచారని ప్రశ్నిస్తే అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు. గనుల్లో వాడే సామగ్రి ఖర్చు పెరిగితే దాని భారం చివరకు సంస్థపైనే, కార్మికులపై పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో సింగరేణి డైరెక్టర్లు జీవీ రెడ్డి, వీకే శ్రీనివాస్ కీలక ప్రశ్నలు లేవనెత్తారని కేటీఆర్ వెల్లడించారు. జిలెటిన్ స్టిక్స్, పేలుడు పదార్థాలపై 30 శాతం ధర పెంచాల్సిన అవసరం లేదని, ఖర్చు అనవసరంగా పెరుగుతోందని వారు బోర్డు సమావేశాల్లో నిలదీశారని తెలిపారు. అయితే అవినీతి ప్రశ్నించిన డైరెక్టర్లపై చర్యలు తీసుకున్నారే తప్ప, అధిక ధరలతో లాభపడుతున్న కాంట్రాక్టర్లపై మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేయలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, నిజాయితీగా మాట్లాడిన వారిని శిక్షించి, అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడటం ఏ రకమైన పాలన అని ప్రశ్నించారు.
ఈ అన్ని అంశాలను గవర్నర్ దృష్టికి సవివరంగా తీసుకెళ్లామని కేటీఆర్ తెలిపారు. సింగరేణి కాలరీస్ సంస్థలో 51 శాతం ఓనర్‌షిప్ తెలంగాణ ప్రభుత్వానిదని, మిగిలిన 49 శాతం కేంద్ర ప్రభుత్వానిదని ఆయన గుర్తుచేశారు. అంటే ఈ సంస్థలో ఖర్చయ్యే ప్రతి రూపాయి ప్రజాధనమేనని, ముఖ్యంగా సింగరేణి కార్మికుల రక్తం, చెమటతో వచ్చిన డబ్బేనని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి ప్రజాధనాన్ని బెదిరింపులు, అక్రమ టెండర్లు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కు ద్వారా కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులు ఈ విషయాలపై ఆలోచన చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఈ ప్రభుత్వం దోచుకుంటోందో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. తాము ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం రాకపోవడం చూస్తేనే ఈ అవినీతి ఎంత లోతుగా ఉందో అర్థమవుతుందని చెప్పారు. సింగరేణి కార్మికుల భవిష్యత్తుతో, వారి సంస్థతో ఈ ప్రభుత్వం ఆటలాడుతోందని ఆరోపించారు.
కేటీఆర్ తన వ్యాఖ్యల్లో రాజకీయంగా మరింత ఘాటైన ఆరోపణలు కూడా చేశారు. అన్నదమ్ముళ్లు దోచుకున్న దోపిడీ రేవంత్ రెడ్డికి సరిపోవడం లేదని ఆయన విమర్శించారు. హిల్ట్ కుంభకోణం పేరుతో హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లో భూముల దోపిడీకి ప్రయత్నించారని, సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిందని గుర్తు చేశారు. అన్నదమ్ముళ్ల దోపిడీని తమ పార్టీ అడ్డుకుందని, కానీ అది సరిపోనట్టు ఇప్పుడు బావమరిది కోసం సింగరేణిని గుత్తకు రాసిచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు




