కేబీఆర్‌ పార్కు రోడ్డు విస్తరణపై హైకోర్టు కెక్కిన బాధితులు

తమ ఇల్లు ,వ్యాపార సముదాయాలు కోల్పోతున్నామని ఆవేదన
మరో మారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వాలని హై కోర్ట్ ఆదేశం
పిటిషనర్ల వినతిపత్రాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు


జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి :

నగరంలోని కేబీఆర్‌ పార్కు రహదారి విస్తరణకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. రహదారి విస్తరణ వల్ల 306 ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోతున్నామని రోడ్డు నెం 92లో ఉన్న కాలనీవాసుల పిటీషన్‌ వేశారు. 100 నుంచి 120 ఫీట్ల వరకు విస్తరణ చేపడుతున్నారనట్లు పిటీషనర్లు తెలిపారు. విరంచి ఆస్పత్రి చౌరస్తా నుంచి కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు విస్తరణ చేయాలని నిర్ణయించారని, రహదారి విస్తరణపై సీఎస్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చామని కాలనీవాసులు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు మార్కింగ్ వేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రహదారికి మరోవైపు ప్రభుత్వ భూమియే ఉందన్నారు. అటువైపే పూర్తిగా విస్తరణ చేపడితే నష్టం తగ్గుతుందని పిటీషనర్లు కోర్టుకు తెలిపారు. దీనిపై విచారించిన హైకోర్టు.. మరోసారి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వాలని పిటీషనర్లను ఆదేశించింది. పిటిషనర్ల వినతిపత్రాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు న్యాయస్థానం ఆదేశిస్తూ.. పిటీషన్లపై విచారణ ముగించింది.

You may also like...

Translate »