స్మార్ట్‌ఫోన్ ఆధారిత జనగణనకు తెలంగాణ సన్నాహాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జనాభా లెక్కల సేకరణను రెండు దశల్లో చేపట్టనుండగా, మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్ ఆధారంగా సాగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని 12 గ్రామాలు, అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 112వ డివిజన్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన డేటా సేకరణ విజయవంతమైంది.
ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ప్రతి ఇల్లు, కట్టడం, వాటిలోని సౌకర్యాల వివరాలను ఎన్యూమరేటర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలోని ప్రత్యేక జనగణన యాప్ ద్వారా నమోదు చేశారు. ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఆఫ్‌లైన్ డేటా ఎంట్రీకి అవకాశం కల్పించి, తరువాత అప్‌లోడ్ చేసే సౌలభ్యం అందించారు. ఎదురైన సాంకేతిక సమస్యలను కేంద్రానికి నివేదించగా, అవి పరిష్కరించబడ్డాయి.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతో ఈ ప్రక్రియను అమలు చేయనున్నారు. వారికి రెండు దశల్లో శిక్షణ ఇవ్వనుండగా, మొత్తం ఖర్చు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మొదటి దశలో 2026 ఏప్రిల్–మే మధ్య గృహాలు, కట్టడాల వివరాలు సేకరిస్తారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక వివరాలతో పాటు కులగణన కూడా చేపట్టనున్నారు. ఇది దేశంలో 16వ జనగణనగా, స్వాతంత్ర్యానంతరం ఎనిమిదవదిగా నిలవనుంది.
