రోడ్డిలా… జాతర సాగేదెలా!?

సోమప్ప జాతర వేళ రహదారి పనులపై ఆందోళన
జ్ఞాన తెలంగాణ,సూర్యాపేట జిల్లా ప్రతినిధి :
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని చిల్లేపల్లి నుంచి ముకుందాపురం (కల్లూరు) ఎక్స్ రోడ్ వరకు సుమారు పది కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారి విస్తరణ పనులు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కీలక రహదారి పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల చింతకుంట్ల గ్రామ అవుట్‌స్కర్ట్స్ నుంచి బెల్లపేనెల (బూర్గుల తండా) వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర రోడ్డును పూర్తిగా తవ్వి మట్టి పోసే పనులు చేపట్టారు. అయితే పనుల వేగం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ ప్రాంతం మొత్తం గుంతలు, దుమ్ముతో నిండిపోయి ప్రయాణానికి అతి కష్టసాధ్యంగా మారింది. సూర్యాపేట–మిర్యాలగూడ ప్రధాన రహదారుల్లో ఒకటైన ఈ మార్గం మీదుగా రోజూ వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ప్రస్తుతం ఈ రహదారి పరిస్థితి వాహనదారులకు శాపంగా మారిందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సోమప్ప జాతర వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ జాతరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రమే కాకుండా పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముంది. అయితే జాతర ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉండగా, ఈ రహదారి పనులు పూర్తికాకపోవడం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
జాతర సమయంలో భక్తుల రాకపోకలకు ఈ రహదారే ప్రధాన మార్గంగా ఉండగా, ప్రస్తుత దుస్థితిలో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోతే సోమప్ప జాతరకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారు పనులను వేగవంతం చేస్తారా లేదా అన్న సందేహం భక్తులు, ప్రయాణికుల మనసుల్లో నెలకొంది.
గుత్తేదారు నిర్లక్ష్యానికి తోడు సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు కూడా నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పనుల పురోగతిపై పర్యవేక్షణ లోపించిందని, కాలపరిమితి ఉన్నప్పటికీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా సూర్యాపేట జిల్లా అభివృద్ధికి కీలకంగా వ్యవహరిస్తున్న జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సోమప్ప జాతరకు హాజరయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ఈ రహదారి పరిస్థితి అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది. జాతర ప్రారంభానికి ముందే రోడ్డు పనులు పూర్తి చేయకపోతే ప్రభుత్వ ప్రతిష్ఠకే భంగం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అందువల్ల సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, గుత్తేదారుపై ఒత్తిడి తెచ్చి రహదారి పనులను వేగవంతం చేయాలని స్థానిక నాయకులు, ప్రజలు, ప్రయాణికులు, భక్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సోమప్ప జాతర భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న వేడుక కావడంతో, రహదారి నిర్లక్ష్యం మరింత కాలం కొనసాగితే తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
