KCR Again CM: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని

KCR Again CM: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని..

దానికి 10-12 ఎంపీ సీట్లు వస్తే చాలని మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ చేతిలో మోసపోయిన ప్రజలు ఇకనైనా బీఆర్‌ఎస్‌ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో ఆదరించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.*లేకపోతే మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ చేతిలో మోసపోతారని హెచ్చరించారు. అత్యధిక స్థానాలు తాము గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌పై కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. ఈసారి కరీంనగర్‌ ఎంపీగా బోయినపల్లి వినోద్‌ కుమార్‌ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు. బండి సంజయ్ ఐదేండ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, జై శ్రీ రామ్ నినాదాలతో యువతకి మతపిచ్చి అంటగడుతున్నారని విమర్శించారు. బీజేపీ వచ్చాక దేవుళ్లు పుట్టినట్టు సృష్టిస్తున్నారని తెలిపారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలకు ఎవరికీ తెలియని వ్యక్తి అని, బండి సంజయ్ గెలుపు కోసం బలం లేని వ్యక్తిని, డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని తెలిపారు.తెలంగాణ రాష్టంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారకులు మన కార్యకర్తలేనని, కారు ఓవర్ లోడ్ అయిందని, ఐక్యమత్యంతో పనిచేసి ఎంపీ గా వినోద్ కుమార్ గెలిపించాలని కేటీఆర్‌ కోరారు. బండి సంజయ్ దేవుళ్ల పేరుతో రాజకీయం చేయడమే తెలుసు కానీ అభివృద్ధి చేయడం చేత కాదని మండిపడ్డారు. మనం కూడా జై శ్రీరామ్‌ అందామని పిలుపునిచ్చారు. రాముడు అందరివాడని.. రాముడు ఎమ్మెల్యే, ఎంపీ కూడా కాదని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యనే పోటీ అని స్పష్టం చేశారు.ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం, రాజ్యాంగం మార్పు, డీలిమిటేషన్‌లో తెలంగాణకు అన్యాయం జరగరాదు అంటే అది ఒక్క బీఆర్‌ఎస్‌ పార్టీ ద్వారానే సాధ్యమని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోదీకి ఓటు వేయవద్దని ప్రజలకు సూచించారు. 70 ఏళ్ల వయసులో తుంటి విరిగినా కూడా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ బస్సు యాత్ర పేరిట ప్రజల్లో తిరుగుతున్నారని గుర్తు చేశారు. తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు నాయకులంతా కలిసి పని చేయాలని సూచించారు. అప్పుడే పార్టీ కోలుకుని లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందుతుందని తెలిపారు.

You may also like...

Translate »