ఎన్నికల సరళిపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో అధికారం దక్కేదెవరికి. ఇప్పుడు ప్రతీ చోట ఇదే చర్చ. పోలింగ్ సరళి ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెంచింది. పైకి మాత్రం గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల హింస పైన సిట్ విచారణ చేస్తోంది. ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీఎం జగన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
జగన్ విదేశీ పర్యటనపై ఏపీలో పోలింగ్ సరళి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లడమేమిటని ప్రశ్నించారు. జగన్ రాష్ట్రంలో ఉండాలని.. శాంతి భద్రతలను కాపాడవలసింది ముఖ్యమంత్రి, ఆయన మంత్రులేనని అన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం గర్హనీయమన్నారు.
లక్ష్మీనారాయణ కామెంట్స్ పగలు, ప్రతీకారాలతో రాజకీయ పార్టీలు.. పగ తీర్చుకోవడం సిగ్గుతో తలదించుకోవలసిన విషయమని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రోడ్ల మీద రాడ్లు పట్టుకొని దండయాత్రలు చేయడం మనం లైవ్‌లో చూశామని, ఆయా పార్టీల నేతలు దాడులను నియంత్రించలేక పోయాయని మాజీ జేడీ విమర్శించారు. దాడులకు పాల్పడిన వారిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. పోలింగ్ రోజున144 సెక్షన్ అయితే ఉంది.. కానీ ఎక్కడా అమలు కాలేదన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.