గ్రామాలలో జోరుగా ఎన్నికల ప్రచారం


సభలకు ప్రచారానికి హాజరైన వారికి ..200/-కూలీ.


ఓ పార్టీ ప్రచార సభకు వచ్చిన మహిళలు.


జ్ఞాన తెలంగాణ – బోధన్
గ్రామాలలో ఓట్ల సందడి జోరందుకుంది. అలాగే ఎంపీ అభ్యర్థుల పర్యటన, ప్రచారం కొనసాగుతున్నాయి. దాంతో ప్రధాన గ్రామాలలో నాయకులు అభ్యర్థులతో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార సభలు జనంతో సక్సెస్ కావడానికి నాయకులు శ్రమించవలసి వస్తుంది. దాంతో అభ్యర్థుల వద్ద తమ పలుకుబడి పెరగడానికి జన సమీకరణకు కష్టపడుతున్నారు. దాంతో మహిళలకు ఒక్కొకరికి 200/- నుంచి 250/-రూపాయలు చెల్లించి ప్రచార సభలకు తరలిస్తున్నారు. మహిళలు కూడా పోటీపడి ప్రచారానికి వెళ్తున్నారు.ఏ పార్టీ వారు వచ్చిన వారికి సమయమిచ్చి ఆ సమయంలో ప్రచారానికి వెళ్లడానికి బేరం కుదుర్చుకుంటున్నారు. దాంతో నాయకుల రాకతో కాలనీలు కళకళలాడుతున్నాయి.


ఉపాధి కూలీల వద్దకే ఎన్నికల ప్రచారం…


గ్రామీణ ప్రాంతాలలో జనం ఉదయం ఏడు గంటలకే ఉపాధి హామీ కూలీ పనులకు తరలివెళ్లడంతో కాలనీలలో జనం లేక బోసిపోతున్నాయి .దాంతో ఎన్నికల ప్రచారం నిర్వహించవలసిన నాయకులు వారు కూడా రూటు మార్చి కాలనీలలో కాకుండా ఏకంగా ఉపాధి హామీ పనిచేస్తున్న స్థలం వద్దకే వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దాంతో కూలీలు వారి పనులు ఆపేసి నాయకుల చెప్పే మాటలు వినవలసి వస్తుంది. అలాగే ఎండ వేడిమి వలన, ఉష్ణోగ్రత తీవ్రవలన పొద్దంతా నాయకులు ఎన్నికల ప్రచారం నిలిపిస్తున్నారు . సాయంత్రం ఆరు తర్వాతనే గ్రామాలకు వెళ్లి కాలనీలలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దాంతో రాత్రి వేళ గ్రామాలలో ఎన్నికల ప్రచార సందడి నెలకొంది. పనిలో పనిగా ముఖ్య నాయకులు అభ్యర్థలు నాయకుల విన్నపం మేరకు పలు గ్రామాలకు హాజరు కావడంతో స్థానిక నాయకులు వారి పలుకబడిని ఉపయోగించి మందిని తరలిస్తున్నారు. కొంతమంది ముఖ్య నాయకులు అభ్యర్థుల వద్ద మరింత పలుకుబడి పెంచుకోవడానికి ఇప్పటినుంచి శ్రమిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో పార్టీ పదవులకు గాని ఇతరత్ర పదవులకు గాని నాయకులు తమను ఆదుకుంటారని వారి ఆలోచన. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న ముఖ్య నేతలు కార్యకర్తలు జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏదేమైనా మరో పది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం వలన మహిళలకు ఎంత కొంత కూలి డబ్బులు రావడంతో మహిళలు ఏ పార్టీ అయితే మాకేంటి డబ్బులు ఇస్తే వస్తాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

You may also like...

Translate »