తగ్గేదే..లే

- గెలుపు గర్వం వద్దు ప్రజల మద్దతుతో ఉండండి
- సర్పంచ్ ల సన్మాన సభలో మాజీ ఎమ్మెల్యే సండ్ర
జ్ఞాన తెలంగాణ,సత్తుపల్లి ఆర్.సీ :
: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్ లుగా గెలుపొందిన సందర్భంగా మున్సిపాలిటీ కేంద్రంలోని డి యన్ పి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన సర్పంచ్ లను శాలువతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోనే కల్లూరులో అత్యధిక బిఆర్ఎస్ సర్పంచ్ లు గెలవడం ఆనందంగా ఉందన్నారు. అదే జోష్ తగ్గకుండా తరువాత జరగనున్న ఎంపీటీసీ జడ్పిటిసి సహకార సంఘాల ఎన్నికలతో పాటు నూతనంగా మున్సిపాలిటీ ఎన్నికలు జరుపుకోనున్న కల్లూరులో గులాబీ జెండా ఎగరాలని అన్నారు. గెలిచామనే గర్వంతో కాకుండా అధికార పార్టీని కాదని మనల్ని గెలిపించిన ప్రజలకు మద్దతుగా ఉండాలని కోరారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన, సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పిన మనపై నమ్మకంతో మనల్ని ఆశీర్వదించిన ప్రజలకు వారి సమస్యలపై నిరంతరం పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో కళ్యాణలక్ష్మి, రైతుబంధు,రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను పార్టీలను చూసి ఇవ్వలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల తీర్పుకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని గత ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రజల కోసం నియోజకవర్గంలో పనిచేస్తున్నానని అదే స్ఫూర్తితో ఓటమిపాలైన సర్పంచ్ లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజల మద్దతు కోసం పనిచేయాలని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలంలోని అత్యధిక జనాభ గలిగిన మేజర్ పంచాయతీలు బిఆర్ఎస్ కైవసం చేసుకున్నాయంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాబలం బిఆర్ఎస్ కి ఉందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా జరగనున్న ఎన్నికలను ఎదురుకొని పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలేపు రామారావు, మాజీ జెడ్పిటిసి కట్ట అజయ్ బాబు, డాక్టర్ లక్కినేని రఘు, మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ,మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నూతన సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.
