తెలంగాణ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు

– చలి తగ్గినా అప్రమత్తత తప్పనిసరి
– కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గింపు
– తూర్పు, ఆగ్నేయ గాలుల ప్రభావంతో తేమ పెరుగుదల
– రాష్ట్రాన్ని కమ్మేస్తున్న తీవ్రమైన పొగమంచు
– శంషాబాద్‌లో 50 మీటర్ల ఎత్తు వరకు పొగమంచు
– రాబోయే రోజుల్లో మళ్లీ చలి పెరిగే సూచనలు
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో,జనవరి 01:
తెలంగాణ ప్రజలను గత కొన్ని రోజులుగా వాతావరణ మార్పులు అయోమయంలోకి నెట్టుతున్నాయి. ఒకవైపు చలి తీవ్రత తగ్గినట్లు అనిపిస్తుండగా, మరోవైపు ఉదయాన్నే రాష్ట్రాన్ని కమ్మేస్తున్న దట్టమైన పొగమంచు ప్రజల దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా ప్రకటన ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేర పెరిగాయి. దీంతో డిసెంబర్ నెలంతా వణికించిన తీవ్రమైన చలికి తాత్కాలిక ఉపశమనం లభించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు వివరించిన ప్రకారం, ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వచ్చే చల్లని గాలుల స్థానంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమతో కూడిన గాలులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ గాలుల ప్రభావంతో వాతావరణంలో తేమ శాతం గణనీయంగా పెరిగింది. చలికాలంలో సాధారణంగా తేమ తక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. తక్కువ ఉష్ణోగ్రతలతో పాటు తేమ శాతం వంద శాతానికి చేరుకోవడం వల్ల భూమి సమీపంలోనే తీవ్రమైన పొగమంచు ఏర్పడుతోంది.
ఈ పొగమంచు సాధారణంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. శంషాబాద్ ప్రాంతంలో అయితే భూమి నుంచి కేవలం 50 మీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగమంచు కమ్మేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. రహదారులపై దృశ్యమానత తగ్గిపోవడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. ఉదయం వేళల్లో వాహనాలు నడిపేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పొగమంచుకు కాలుష్యం తోడైతే ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. నగర ప్రాంతాల్లో, పరిశ్రమలు మరియు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తెల్లవారుజామున బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని వైద్యులు, వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
ఈరోజు నమోదైన ఉష్ణోగ్రతలపై శ్రీనివాస్ రావు వెల్లడించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 11.2 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలో ఎక్కడా కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. హైదరాబాద్ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీల వరకు నమోదవగా, గతంలో అత్యల్పంగా నమోదైన పటాన్‌చెరు, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు 12–13 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇది చలి తీవ్రత తగ్గినదానికి స్పష్టమైన సంకేతం.
రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే నాలుగో రోజు నుంచి గాలుల దిశ మళ్లీ మారి ఉత్తర గాలులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మళ్లీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
