ధరణి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక

జ్ఞాన తెలంగాణ, (రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్)

పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండ బాధ్యతగా పని చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. 
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక ధరణి దరఖాస్తుల పరిశీలన, ప్రభుత్వ భూములు రక్షణపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరించాలి అనే విషయం పై ఆర్డీఓలకు, తహసీల్దార్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గడువు లోపల పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఆన్లైన్ లోనే కాకుండా ఫైల్స్ రూపంలో కూడా నిర్వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రిపోర్టులను పరిశీలించి సంబంధిత నివేదికలతో పూర్తిస్థాయిలో కలెక్టరేట్ కు సమర్పించాలని అన్నారు. ప్రభుత్వం పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకై మే 31 తేదీ వరకు పెండింగ్‌ సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, చాల బాధ్యతతోపాటు వేగవంతంగా పూర్తీ చేయాలన్నారు. ప్రతి మండలంలోని గ్రామాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు ప్రతి తహసీల్దార్ వద్ద ఉండాలని, ధరణి దరఖస్తులను అందుబాటులో ఉన్న రికార్డుల ద్వారా పరిశీలించి పూర్తి చేయాలన్నారు. మాడ్యూల వారీగా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

You may also like...

Translate »