ప్రకృతి సత్యాలు

- అడియాల శంకర్.
నేలతల్లి చెప్పింది!
నిరాశ్రయులకు ఆశ్రయం
కల్పించాలని.
మండుచున్న సూర్య గోళం చెప్పింది!
మంచి జరిగినప్పుడు
వేడిమినైనా భరించాలని
ఒక ఆకు రాలుతూ చెప్పింది!
ఈ జీవితం శాశ్వతం కాదని.
ఎప్పుడో ఒకప్పుడు రాలిపో
వలసిందే నని.
చీమల బారు చెబుతోంది
క్రమశిక్షణతో మెలగాలని
ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది!
జీవించేది ఒక్క రోజైనా పరిమళాలు
వెదజల్లుతూ గౌరవంగా జీవించమని.
ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది!
చేదును గ్రహిస్తూ
మంచిని పంచమని.
ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది!
ఉండేది ఒక్క క్షణమైనా
ఉజ్వలంగా ఉండమని.
ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది!
చివరి క్షణం వరకు పరులకు
దారి చూపమని
ఒక వృక్షం చల్లగా చెప్పింది!
తను కష్టాల్లో ఉన్నా,ఇతరులకు
సుఖాన్నివ్వుమని,ఆకలి తీరడానికి
ఆహారాన్ని ఇవ్వుమని
ఒక ఏరు జలజలా పారుతూ చెప్పింది!
తనలాగే కష్ట సుఖాల్లో కూడా ఆగకుండా
సాగమని.
జాబిల్లి వెలుగుతూ చెప్పింది!
తనలాగే ఎదుటివారిలో వెలుగు
నింపమని……………..