నందాదేవీ న్యూక్లియర్ మిస్టరీ

భారతదేశంలోనే అత్యంత ఎత్తైన, పవిత్రమైన హిమాలయ శిఖరాలలో ఒకటైన నందాదేవీ ప్రాంతం దశాబ్దాలుగా ఒక మర్మమైన, భయానకమైన రహస్యాన్ని తన గర్భంలో దాచుకుని ఉందన్న వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. కోల్డ్‌వార్‌ కాలంలో చైనా అణు శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అణు పరీక్షలు, క్షిపణి కార్యకలాపాలపై నిఘా కోసం అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) అత్యంత రహస్యంగా చేపట్టిన ఒక కోవర్ట్ ఆపరేషన్ నందాదేవీ పర్వత శ్రేణుల్లో అమలైందని న్యూయార్క్ టైమ్స్ దర్యాప్తు కథనాలు, పలు అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడించాయి. 1964లో చైనా జింజియాంగ్ ప్రాంతంలో తొలి అణు బాంబు పేల్చడంతో అమెరికా తీవ్ర ఆందోళనకు గురైంది. చైనా అణు శక్తిగా మారడం ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చేస్తుందన్న భయంతో, పెంటగాన్, సీఐఏ కలిసి రిమోట్ సెన్సింగ్ స్టేషన్ల ద్వారా చైనా కార్యకలాపాలను పర్యవేక్షించాలన్న వ్యూహాన్ని రూపొందించాయి. మొదట ఎవరెస్ట్ పర్వతాన్ని ఎంపిక చేయాలని భావించినా, చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండటం రాజకీయంగా, భౌగోళికంగా సమస్యగా మారడంతో, భారత ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం ఉత్తరాఖండ్ గర్వాల్ హిమాలయాల్లోని నందాదేవీ శిఖరాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సహకారంతో ఈ రహస్య మిషన్ ప్రారంభమైంది. సీఐఏ, ఐబీ సంయుక్తంగా 10 అడుగుల ఎత్తైన యాంటెన్నా, రెండు ట్రాన్సీవర్ సెట్లు, ప్లుటోనియంతో నడిచే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ (RTG) ను అక్కడ ఏర్పాటు చేశాయి. ఈ పరికరంలో ఏడు ప్లుటోనియం క్యాప్సుల్స్ ఉన్నట్లు అధికారిక నివేదికలే చెబుతున్నాయి. ఈ మిషన్ నిర్వహణ బాధ్యతలను భారత సైనిక అధికారి, ప్రఖ్యాత పర్వతారోహకుడు కెప్టెన్ మన్మోహన్ సింగ్ కొహ్లీకి అప్పగించారు. ఆయనతో పాటు ఐటీబీపీకి చెందిన నలుగురు సిబ్బంది, ఫూ డోర్జీ షెర్పా సహా 14 మంది షెర్పాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. టిబెట్ మూలాలు కలిగిన షెర్పాలు ఉత్తర నేపాల్ పర్వత ప్రాంతాల్లో జీవించే అనుభవజ్ఞులైన పర్వతారోహకులు. ఈ బృందం అమెరికాలో ప్రత్యేక శిక్షణ పొంది 1965 మధ్యలో భారత్‌కు తిరిగొచ్చింది. అమెరికా వైపు నుంచి బేరీ బిషప్ నాయకత్వంలో మరో బృందం పనిచేసింది. నందాదేవీ శిఖరం భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో 25,645 అడుగుల ఎత్తులో ఉండటం, భారతదేశంలో రెండో ఎత్తైన పర్వతం కావడం, ప్రపంచంలో 23వ స్థానంలో ఉండటం ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మార్చింది. 1965 సెప్టెంబర్‌లో ఎస్‌ఎన్‌ఏపీ-19సీ అనే పోర్టబుల్ న్యూక్లియర్ జనరేటర్‌ను అక్కడ అమర్చారు. ఇది నాగసాకిపై పడిన అణుబాంబులో ఉపయోగించిన ప్లుటోనియంలో మూడో వంతు శక్తిని కలిగి ఉందన్న సమాచారం భయాన్ని మరింత పెంచుతోంది. అక్టోబర్ 16 నాటికి పనులు పూర్తికావడంతో బృందం వెనుదిరిగింది. అయితే 1966 మేలో ఆ పరికరాన్ని తిరిగి తీసుకురావడానికి వెళ్లిన బృందానికి అక్కడ ఏ ఆనవాళ్లు కనిపించలేదు. న్యూట్రాన్ డిటెక్టర్లతో గాలింపు చేసినా ఫలితం లేకపోయింది. భారీ మంచు తుఫాన్లు, కొండచరియలు విరిగిపడటంతో ప్లుటోనియం పరికరం లోతైన మంచు పొరల్లో కలిసిపోయిందన్న అంచనాకు వచ్చారు. అప్పటి నుంచి ఈ ప్లుటోనియం మంచులో కరిగి నదులుగా, భూగర్భ జలాలుగా, పర్వత శ్రేణులుగా వ్యాపించి ఉండవచ్చన్న భయం శాస్త్రవేత్తలను, స్థానిక ప్రజలను వెంటాడుతోంది. 1978 వరకు ఈ విషయం పూర్తిగా గోప్యంగానే ఉంచబడింది. అదే ఏడాది ఏప్రిల్‌లో అమెరికా కాంగ్రెస్‌లో ఈ అంశం లేవనెత్తడంతో వారం రోజుల్లోనే భారత పార్లమెంటులోనూ చర్చకు వచ్చింది. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ మిషన్‌పై లోతైన అధ్యయనం కోసం డాక్టర్ ఆత్మారామ్, హోమీ సేత్నా, ఎంజీకే మీనన్, డాక్టర్ రాజారామన్న, డాక్టర్ వీ రామలింగస్వామి, డాక్టర్ ఏకే సాహలతో కూడిన ఆరుగురు శాస్త్రవేత్తల కమిటీని నియమించారు. ఈ కమిటీ 1978లో తన తుది నివేదికను సమర్పిస్తూ, నందాదేవీ ప్రాంతంలో నిరంతర రేడియోధార్మిక పరీక్షలు, గాలి, నీరు, నేల నమూనాల సేకరణ తప్పనిసరి అని సూచించింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ మిషన్‌లో పాల్గొన్న అమెరికన్ పర్వతారోహకుడు జిమ్ మెక్‌కార్టీ ఫ్లుటోనియం మంచులో కరిగిపోయి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, తనకు టెస్టిక్యులర్ క్యాన్సర్ సోకిందని, కుటుంబ చరిత్రలో ఎలాంటి క్యాన్సర్ లేదని పేర్కొనడం కలకలం రేపింది. ఈ పరికరం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లితే ప్రపంచానికే ముప్పు అని ఆయన హెచ్చరించారు. 2021లో నందాదేవీ ప్రాంతంలో భారీగా మంచు చరియలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ఈ భయాలను మరింత పెంచింది. ఫ్లుటోనియం కారణంగానే వాతావరణ మార్పులు, భూభౌతిక అస్థిరత పెరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అమెరికా సీఐఏ గానీ, భారత ప్రభుత్వం గానీ ఇప్పటికీ అధికారికంగా నోరు విప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నందాదేవీ రహస్య న్యూక్లియర్ మిషన్ నేటికీ భారత శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, హిమాలయ గ్రామ ప్రజలు, పర్వతారోహకుల మధ్య తీరని ప్రశ్నగా, భవిష్యత్తుపై నీలినీడలా వేలాడుతున్న ప్రమాదంగా కొనసాగుతూనే ఉంది.

You may also like...

Translate »