మోయినాబాద్–బీజాపూర్ రోడ్డుపై మళ్లీ ఘోర ప్రమాదం…

- ఒకరు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం
- సింహపు గుహలా మారిన రూట్ — ప్రాణాలు తీస్తున్న ప్రమాదాలు”
- “వెడల్పు లేని రహదారి… వెలుతురు లేని రాత్రి — ప్రయాణికులపై ముప్పు”
- “ప్రజలలో పెరుగుతున్న భయం — ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్
మోయినాబాద్, జ్ఞాన తెలంగాణ:
మోయినాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదాలు ఆగేలా కనిపించడం లేదు. ఈరోజు ఉదయం తాజ్ డ్రైవ్–ఇన్ సమీపంలో జరిగిన కారు ప్రమాదం ఈ రూట్ ప్రమాదకరతను మరోసారి బయటపెట్టింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు కలిసి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢీకొనిన ప్రభావంతో వాహనాలు పూర్తిగా ధ్వంసమై అవశేషాలు రోడ్డంతా చెల్లాచెదురుగా కనిపించాయి.
ఈ రహదారి ఇటీవల వరుస ప్రమాదాలకు కేంద్రంగా మారింది. రహదారి సన్నగా, మలుపుల్లో దర్శనలోపం, రాత్రివేళల్లో వెలుతురు లేకపోవడం వంటి కారణాలతో ఈ మార్గం ప్రయాణికులకు ప్రాణాలపైనే ముప్పుగా మారిందని పోలీసులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం మిర్జాగూడ సమీపంలో లారీ–ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రజలు మరిచిపోకముందే ఇప్పుడీ ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికుల్లో ఆందోళన రేపుతోంది.
“ఈ రోడ్డుపై ప్రయాణం అంటే సింహపు గుహలోకి వెళ్లినట్టే… ఎప్పుడు ఎదురు వాహనం ఢీకొంటుందో తెలియదు” అని గ్రామస్థులు చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఈ రూట్‌లో ప్రయాణించవద్దని, ముఖ్యంగా రాత్రివేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదాలు తగ్గాలంటే రహదారిని వెడల్పు చేసి రెండు లైన్లుగా మార్చడం, ప్రమాద మలుపుల్లో హెచ్చరిక బోర్డులు, రాత్రి లైటింగ్ ఏర్పాట్లు, అవసరమైన చోట్ల డివైడర్ నిర్మాణం, స్పీడ్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వరుసగా ప్రాణాలు కోల్పోతున్న ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
