ఖమ్మంలో భార్యను గొంతు కోసి హతమార్చిన భర్త

జ్ఞానతెలంగాణ,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం నగరంలో భార్యను భర్త క్రూరంగా గొంతు కోసి హతమార్చిన దారుణం వెలుగుచూసింది. కొత్త పురపాలక సంఘం వద్ద లయన్స్ సంఘం పక్కనున్న సన్నగల్లీలో భాస్కర్ అనే వ్యక్తి కఠిన హత్యకి పాల్పడటం ప్రాంతంలో భయాందోళనకు కారణమైంది. ముందుగా తన కుమార్తెను చంపేందుకు కత్తితో దాడికి దిగిన భాస్కర్, చిన్నారి చాకచక్యంగా తప్పించుకోవడంతో ఆ బాలిక చేతికి తీవ్ర గాయాలు ఏర్పడి మూడు వేళ్లు తెగిపోయాయి. అనంతరం భార్య సాయి వాణి (31) పై పాశవికంగా కత్తిప్రయోగం చేసి అక్కడికక్కడే ప్రాణాలు తీశాడు.
సాయి వాణి, భాస్కర్ ఇద్దరూ చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కలహాలు పెచ్చుమీరినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కలహాల నేపథ్యంలోనే భాస్కర్ ఈ ఘోరానికి పాల్పడ్డాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారమొచ్చిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసుల బృందం భాస్కర్‌ను అదుపులోకి తీసుకుంది. తీవ్రగాయాలపాలైన చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
