దేశానికి పెద్దన్నగా నరేంద్ర మోదీ సహకరించాలి : రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 18 :

దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ ఐటీసీ కోహినూర్‌లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకమవుతుందని అన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ మరో కొత్త నగరాన్ని నిర్మించాలని చూస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ రైజింగ్-2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, మిగతా సమయాల్లో పరస్పరం సహకారంతో అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు.

ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్‌ను అభివృద్ధి చేసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్రం కృషి చేస్తోందని, ఈ క్రమంలో కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ కూడా భాగమవుతుందని అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తే దేశాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు. కేంద్రం 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని నిర్దేశించుకుందని, అందులో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు.

జీడీపీలో ప్రధానంగా 5 మెట్రోపాలిటన్ నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ దేశానికి ఎంతో కీలకంగా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్ఆర్ఆర్, మూసీ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉండాలని కోరారు. మోదీ గుజరాత్ మోడల్ రూపొందించినట్లే తాము తెలంగాణ మోడల్ తీసుకువచ్చామని, కాబట్టి తన రాష్ట్రానికి ఇచ్చిన సహకారం తమకూ ఇవ్వాలని అన్నారు. మోదీ సబర్మతి ప్రక్షాళన చేసినట్లుగా తాము మూసీని చేస్తున్నామని అన్నారు.

You may also like...

Translate »