బానిసత్వం కన్నా మరణమే మేలు

– పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు


జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్ పాక్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని, మానసికంగా అస్థిరమైన వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ‘ఎక్స్’ వేదికగా ఈ ఆరోపణలు చేశారు. మునీర్ పాలనలో అణచివేత గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని, అధికార దాహంతో కళ్లుమూసుకుపోయిన ఆయన దాని కోసం ఎంతకైనా తెగిస్తారని దుయ్యబట్టారు.

మే 9, నవంబర్ 26 మురిడ్కే ఘటనలను ప్రస్తావిస్తూ.. ఇవి అధికార దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణలని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. పోలీసులు, భద్రతా సిబ్బంది తమ పార్టీ (పీటీఐ) కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. “నిరాయుధులైన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ఏ నాగరిక సమాజంలోనూ ఊహించలేం. మహిళలపై ఇంతటి క్రూరత్వం గతంలో ఎన్నడూ చూడలేదు” అని ఆయన పేర్కొన్నారు.
తన భార్య బుష్రా బీబీని ఏకాంత నిర్బంధంలో ఉంచి అసీమ్ మునీర్ వేధిస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. “బానిసత్వంలో బతకడం కన్నా మరణమే మేలు. అసిమ్ మునీర్ నాపై, నా భార్యపై అన్ని రకాల అన్యాయాలకు పాల్పడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడి కుటుంబం కూడా ఇంతటి క్రూరత్వాన్ని ఎదుర్కోలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. “ఆయన ఎన్ని చేసినా సరే, నేను తలవంచను, లొంగిపోను అని మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నాను” అని తేల్చి చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వంతో సయోధ్యకు వెళ్లే ప్రసక్తే లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కీలుబొమ్మ ప్రభుత్వంతో గానీ, సైనిక నాయకత్వంతో గానీ తమ పార్టీ చర్చలు జరపదని అన్నారు. “సమాధానం చెప్పే ముందు అనుమతి తీసుకునే ప్రధాని ఉన్న కీలుబొమ్మ ప్రభుత్వంతో మాట్లాడటం వృథా” అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో చర్చలకు ప్రయత్నించిన ప్రతిసారీ అణచివేత మరింత పెరిగిందని, అందువల్ల చర్చలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు.

You may also like...

Translate »