కవిత గెంటేశారు సరే మరి హరీష్‌కు మద్దతు ?

బీఆర్ఎస్ పార్టీలో కనిపించని రాజకీయం ఇంకా ఇంకా జరుగుతోంది. హరీష్ రావు, సంతోష్ రావుపై ఆరోపణలు చేశారని కవితను సస్పెండ్ చేశారు. కవిత కూడా సస్పెన్షన్ విషయం పట్ల పెద్దగా బాధపడలేదు. తన రాజకీయం తాను చేయాలనుకున్న పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మరక పడింది హరీష్ రావుపైనే. ఆయనపై చేసిన ఆరోపణల్ని ఇప్పటి వరకూ కేటీఆర్ కూడా ఖండించలేదు. కవిత ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసిందని ప్రకటించి హరీష్ రావు మనసు దిటవు పర్చే ప్రయత్నం చేయలేదు.
హరీష్ రావు పై సోషల్ మీడియాలో చర్చలు
హరీష్ రావుపై సోషల్ మీడియాలో విస్తృతంగా ఆరోపణల పరంపర సాగుతోంది. ఆయన కేసీఆర్ వద్దకు వచ్చేటప్పుడు రబ్బరు చెప్పులతో వచ్చారని ఏ వ్యాపారం చేయకుండా ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కవిత మద్దతుదారులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ డిమాండ్ ను వినిపిస్తున్నాయి. కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ ముఖ్యనేతలంతా సైలెంటుగా ఉండటం వల్లనే ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయి. హరీష్ రావు నిజాయితీపరుడని ఆయన కాళేశ్వరంలో అవినీతి చేశాడని తాము నమ్మడం లేదని బీఆర్ఎస్ ముఖ్యనేతల నుంచి ఓ ప్రకటన వచ్చినా.. హరీష్ వర్గం సంతృప్తి చెందుతుంది.
కవితను సస్పెండ్ చేయడమే హరీష్‌కు మద్దతా ?
అయితే హరీష్ రావు విషయంలో బీఆర్ఎస్ కు పూర్తి స్పష్టత ఉందని.. హరీష్ రావుపై కవిత ఆరోపణలకు సస్పెండ్ చేయడమే ఆయనకు ఇచ్చిన సపోర్టు అని కొంత మంది అంటున్నారు. హరీష్ కోసం సొంత కుమార్తెను కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేస్తున్నారు. కవితను సస్పెండ్ చేయడం వరకూ బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఎవరికి అభ్యంతరాలు లేకపోయినా హరీష్ కు ఓ క్లీన్ చిట్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం మాత్రం బీఆర్ఎస్ పార్టీలోని ఓ వర్గంలో గట్టిగా వినిపిస్తోంది.
హరీష్ రావుకు.. పార్టీలో ముందు ముందు గడ్డు పరిస్థితి
ఇప్పటికిప్పుడు ఆయనకు మద్దతుగా ఉన్నట్లుగా కనిపిస్తున్నా… ముందు ముందు ఆయనకు గడ్డు పరిస్థితి వస్తుందని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. కేటీఆర్ పార్టీపై పూర్తి పెత్తనం చెలాయిస్తారు. కానీ హరీష్ రావుకు ఉండే బాధ్యతలు తగ్గిపోతాయి. చివరికి ఆయనను సిద్దిపేటకే పరిమితం చేసినా ఆశ్చర్యం ఉండదని అంటున్నారు. కవిత చేసిన ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీని చాలా కాలం వెంటాడతాయన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.