టీ ఫైబ‌ర్ గ్రిడ్ ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యం

  • టీ ఫైబర్ స‌మీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :

టీ-ఫైబ‌ర్ (T Fiber) ప‌నులు జ‌రిగిన తీరు, ప్ర‌స్తుత ప‌రిస్థితి, భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మ‌గ్రమైన నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారుల‌ను ఆదేశించారు. టీ ఫైబ‌ర్ ప‌నులు చేసిన కాంట్రాక్ట్ సంస్థ‌ల‌కు నోటీసులు ఇచ్చి ప‌నులు చేసిన తీరుపై నివేదిక కోరాల‌ని సీఎం ఆదేశించారు.టీ ఫైబర్ పై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి స‌మీక్ష నిర్వ‌హించారు. సంస్థ‌లో ఉద్యోగుల సంఖ్య‌, వారి ప‌ని తీరును స‌మీక్షించాల‌ని ఈ సందర్భంగా ఆదేశించారు. ప్ర‌తి ప‌ల్లెకు, ప్ర‌తి ఇంటికి ఇంట‌ర్నెట్ సేవ‌లు అందించేందుకు ఉద్దేశించిన కార్య‌క్ర‌మమైనందున పూర్తి స్థాయి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని చెప్పారు.టీ ఫైబ‌ర్ గ్రిడ్ ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక ఉండాల‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన వ్య‌యం, పూర్తి కావ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే నిధులు, వాటి సేక‌ర‌ణ‌, కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను నివేదిక‌లో పొందుప‌ర్చాల‌ని ముఖ్య‌మంత్రి గారు సూచించారు.ఈ స‌మీక్ష‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ‌కృష్ణారావు గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

You may also like...

Translate »