మెహిదీపట్నం డిపో మేనేజర్ నిర్లక్ష్యమే కారణమా?

- లేక ప్రభుత్వ నిర్లక్ష్యమా..?
- గంటసేపు ఎదురు చూశారు – ఒక్క బస్సు కూడా రాలేదు
- ఒకే వైపు వరుసగా పది బస్సులు – ప్రయాణికుల ఆవేదన
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:
ప్రొద్దుటూరు గేట్ వద్ద ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటసేపు బస్సు కోసం ఎదురుచూసిన స్త్రీలు, విద్యార్థులు, ఉద్యోగులు చివరికి విసుగ్గా నిలబడ్డారు. ఒకవైపు వరుసగా పది బస్సులు లైన్లో దూసుకెళ్లగా, మరోవైపు మాత్రం ఒక్క బస్సు కూడా రాకపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది.పైగా ఆ సమయానికి చీకటి పడుతుండగా, రోడ్డు పక్కన కనీసం నాలుగు వీధి లైట్లు కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు కోసం ఎదురు చూస్తున్న వారు భయంతో, అసహనంతో నిలబడి ఉండక తప్పలేదు.మెహిదీపట్నం డిపో బస్సుల నిర్వహణలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. “ప్రజల సౌకర్యం కోసం నడపాల్సిన బస్సులు ఇలా అవ్యవస్థగా నడపడం చాలా బాధాకరం. మెహిదీపట్నం డిపో మేనేజర్ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతిరోజూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం మాకు భరించలేనిది. ఇది ఒక్కరోజు సమస్య కాదు, గత రెండు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్య” అని స్త్రీలు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.“ఉద్యోగ సమయాల్లో బస్సులు లేనట్లయితే మేమెలా గమ్యస్థానాలకు చేరతాం? షెడ్యూల్ మార్చకపోతే రోడ్లపైకి దిగాల్సిందే” అని మరికొందరు హెచ్చరిస్తున్నారు.