ప్రొద్దుటూరు గ్రామంలో మైసమ్మ తల్లి ఆలయం ధ్వంసం

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి:
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో చోటుచేసుకున్న ఒక భయంకర ఘటన గ్రామ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. గ్రామంలోని పెద్దమ్మచెట్టు రోడ్డులో ఉన్న ప్రముఖ మైసమ్మ తల్లి దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు అక్రమంగా కూల్చివేయడం గ్రామంలో తీవ్ర ఉద్విగ్నతకు దారి తీసింది. రెడ్డి బాయికాడ సమీపంలో ఉన్న ఈ దేవాలయం ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్థుల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది.

ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహించి, మైసమ్మ తల్లిని ఆరాధిస్తూ ఈ ఆలయాన్ని భద్రంగా కాపాడుతూ వచ్చిన గ్రామస్థులు ఇప్పుడు తీవ్ర మనోవేదనతో ఉన్నారు. ఈ దౌర్జన్యానికి పాల్పడిన వారు ఎవరైనా సరే, వారు తక్షణమే బాధ్యత స్వీకరించి గ్రామ ప్రజలముందు క్షమాపణలు కోరాలని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, న్యాయపరమైన దర్యాప్తును ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

భారతీయ సంస్కృతి, చట్టాల ఉల్లంఘన

మన దేశపు ఆధ్యాత్మిక సంప్రదాయాలను పరిరక్షించేందుకు 1991లో రూపొందించిన ఆరాధనా స్థలాల పరిరక్షణ ప్రత్యేక నిబంధనల చట్టం ప్రకారం, ఏ దేవాలయాన్ని అయినా అక్రమంగా కూల్చడం ఒక శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని, పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు. మతపరమైన విశ్వాసాలను కించపరచే ఈ చర్యను గ్రామస్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బాధ్యులపై న్యాయ ప్రక్రియ ద్వారా శిక్ష అమలవ్వాలని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

You may also like...

Translate »