ప్రియాంక గాంధీ బుగ్గలంత నునుపుగా రోడ్లు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బీజేపీ నేత రమేష్ బిధూరి (Ramesh Bidhuri) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ (Kalkaji) నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బిధూరి పోటీలో ఉన్నారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే ఓఖ్లా, సంగమ్ విహార్ తరహాలో తన నియోజకవర్గంలోని రోడ్లన్నింటినీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బుగ్గలంత నునుపుగా అభివృద్ధి చేస్తానని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనపై నిప్పులు చెరిగింది. విరుచుకుపడిన అల్కా లంబాబిధూరి వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కల్గాజీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న అల్కా లంబా విరుచుకుపడ్డారు. సహజంగానే సభ్యతలేని భాషలో మాట్లాడే బిధూరి మరోసారి మహిళలను కించపరిచారని తప్పుపట్టారు. మహిళల పట్ల కానీ, సభ (పార్లమెంటు) పట్ల కానీ గౌరవం లేని ఇలాంటి వ్యక్తి అవసరం కల్జాజీ నియోజకవర్గం ప్రజలకు ఉందా అని ప్రశ్నించారు.
కాగా, రమేష్ బిదూరీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ మనస్తత్వానికి అద్దంపడుతోందని ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి అతిషి విమర్శించారు. బీజేపీ నేత, ఎంపీ కూడా అయిన వ్యక్తి, అందునా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఢిల్లీ ప్రజలకు బీజేపీ రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు బిధూరికి, బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
తన వ్యాఖ్యల చుట్టూ వివాదం రేగడంతో మీడియా ముందు భిదూరి క్షమాపణ చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలనే తాను ప్రస్తావించానని, ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. అయితే లాలూ ప్రసాద్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ మాట్లాడలేదని, నరేష్ బలియన్ ఇదే తరహా ప్రకటన చేస్తే ఆప్ పట్టించుకోలేదని అన్నారు. అలాంటి వాళ్లకు ప్రశ్నించే హక్కు ఎక్కడుంటుందని నిలదీశారు.
బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. లోక్సభలో అప్పటి బీఎస్పీ ఎంపీ డేనిషి అలీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సభ వెలుపల, బయట కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన ప్రవర్తన ప్రివిలిజ్ కమిటీ ముందుకు కూడా వెళ్లింది.