ఆడబిడ్డల పట్ల బుద్ధుని వైఖరి

ఆడబిడ్డల పట్ల బుద్ధుని వైఖరి.
ఆడబిడ్డలు అరిష్టం అని బుద్ధుని చెంత కూర్చున్న రాజు పశినీడు (ప్రశేనజిత్తు) భార్య రాణి మల్లిక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని వార్త, విని బాధపడుతున్న రాజుతో ఆడబిడ్డ విద్యావంతురాలైతే, ఆమె తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తుందని ఆడబిడ్డలే ఉత్తమంగా, ఉన్నతంగా ఎదుగుతారని బుద్ధుడు చెప్పారని బాబాసాహెబ్ అంబేడ్కర్ విశదపరిచారు.
రాణి మల్లిక:
భగవాన్ బుద్ధుని సమకాలీనుడైన కోసల దేశ రాజు ప్రశేనజిత్తు పట్టమహిషి మల్లిక.ప్రశేనజిత్తు బౌద్ధ ఉపాసకుడు.ఇతను ధమ్మ మార్గంలో నడుచుటకు కారకులు అతని భార్య మల్లికా రాణి.ఒకసారి ప్రశేనజిత్తుకు అసాధారణమైన కల రావడంతో బ్రాహ్మణ పురోహితులను సంప్రదించగా ఇలాంటి కలలు కష్టాలకు సంకేతాలు అంటూ దీనికి పరిహారంగా విస్తృతంగా జంతువులను బలి ఇచ్చినచో ఆ కష్టాలు నుండి బయటపడవచ్చు అని చెప్పారు. రాజు జంతువులను బలి ఇవ్వడానికి సిద్ధం చేశాడు. ఇంతలో రాణి మల్లిక ఈ జంతు బలులను తీవ్రంగా నిరసించింది.ఇలాంటి కలలు ఎందుకు వచ్చింది భగవాన్ బుద్ధుని అడిగి తెలుసుకుందాం అని రాజును ఒప్పించింది.భగవాన్ బుద్ధుడు ఇలాంటి కలలు రావడం అనేది శుభానికి సూచకాలు అంటూ చెప్పగా రాజు జంతు బలులను విరమించాడు

మగబిడ్డల కంటే ఆడబిడ్డలే మేలు:-
ఒకసారి రాజు ప్రశేనజిత్తు భగవాన్ బుద్ధునితో ధార్మికపరమైన అంశాలను చర్చిస్తున్నాడు.ఇంతలో కోసల దేశ రాజధాని అయిన శ్రావస్తి నగరం నుండి వార్తాహరుడు వచ్చి రాణి మల్లిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది అంటూ రాజు చెవిలో చెప్పాడు.దీంతో రాజు ప్రశేనజిత్తు విషాదవదనుడైనాడు.అప్పుడు భగవాన్ బుద్ధుడు రాజు ఎందుకు ఇలా విషాదవదనంతో ఉన్నాడో కారణం తెలుసుకొని, స్త్రీ ఎందుకు ఉన్నతమైనది రాజుకు విశదపరిచారు.స్త్రీ వలన అటు తల్లిదండ్రులు ఇంటికి మరియు అత్తమామల ఇంటికి మంచి పేరు వస్తుంది.శూరులు, గొప్పవారు మరియు ఉత్తములైన పిల్లలకు స్త్రీ జన్మను ఇవ్వడమే కాకుండా వారిని ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది.కొంతమంది స్త్రీలు పురుషుల కంటే నిజంగా గొప్పవారు.మగవారు కంటే స్త్రీ గుణవతంతురాలు.ఈ విధంగా భగవాన్ బుద్ధుడు నాలుగు అంశాలను వివరించారు. ఈ నాలుగు అంశాలు వలన ఆడబిడ్డ పుడితే సంతోషించాలని రాజుకు హితవుపలికారు.


-అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.B