ఫకీరాబాద్‌లో మహిళ దారుణ హత్య

– తల, చేయి నరికి నగ్నంగా పారేసిన దుండగులు
ఫకీరాబాద్,నవీపేట మండలం,జ్ఞాన తెలంగాణ న్యూస్ :
నిజామాబాద్ జిల్లా మరోసారి పాశవిక హత్యకు వేదికైంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనుగొనడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాసర ప్రధాన రహదారి సమీపంలో మొండెం మాత్రమే ఉన్న శవాన్ని గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
వివరాల్లోకి వెళ్తే — దుండగులు మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆమె తలను మొండెం నుంచి వేరు చేయడమే కాకుండా, ఒక చేయి మరియు మరో చేతి వేళ్లను కూడా నరికివేశారు. మృతదేహం నగ్న స్థితిలో పడి ఉండటంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ హృదయ విదారక దృశ్యం చూసిన వారు కన్నీరు పెట్టుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. ఆధారాల కోసం విస్తృత గాలింపు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతురాలి గుర్తింపుపై దృష్టి సారించారు.
ఇదే ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో మహిళా హత్య కావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస హత్యలతో భయం చెలరేగిందని, రాత్రిపూట బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినమైన శిక్ష విధించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
