కేంద్ర పథకాల అమల్లో నిర్లక్ష్యం సహించబోము : బండి సంజయ్ హెచ్చరిక

జ్ఞానతెలంగాణ,కరీంనగర్,అక్టోబర్ 29 : కేంద్ర పథకాల అమల్లో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. జిల్లాలో జరిగిన “దిశ సమీక్ష” సమావేశంలో వివిధ శాఖల అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఆర్ అండ్ బి, మున్సిపల్, పంచాయతీరాజ్, నేషనల్ హైవేస్, సోలార్, పరిశ్రమల శాఖల పనితీరుపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
కేంద్ర పథకాలపై ప్రగతి రిపోర్టులు విడుదల చేయాలి : కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించాలని, ఇకపై కేంద్ర పథకాల ప్రగతిపై ప్రతి నెలా మీడియాకు రిపోర్టులు విడుదల చేయాల్సిందే అని బండి సంజయ్ స్పష్టంగా తెలిపారు. “కేంద్రం భారీగా నిధులు ఇస్తోంది. కానీ ప్రజలకు తెలియజేయకపోతే ప్రయోజనం ఏమిటి?” అని ప్రశ్నించారు.
కరీంనగర్ యూజీడీ ప్రాజెక్ట్‌పై మండిపాటు : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో యూజీడీ పనులు అట్టర్ ఫ్లాప్‌గా మారాయని, గుంతలు తవ్వి వదిలేయడం వల్ల నిధులన్నీ వృథా అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ లాడ్స్ ఫండ్‌తో కరీంనగర్ గ్రౌండ్ పనుల్లో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. “ఎంసీకే అధికారుల నిర్లక్ష్యం అసహనీయది. ఇకపై అమృత్ స్కీమ్ పర్యవేక్షణ బాధ్యత కమిషనర్‌పైనే ఉంటుంది” అని హెచ్చరించారు.
ఆర్ అండ్ బి పనుల్లో నత్తనడక :కాంట్రాక్టర్లపై ఆగ్రహం : ఆర్ అండ్ బి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు సిండికేట్‌గా వ్యవహరిస్తూ ప్రభుత్వ పనులు నిలిపేస్తున్నారు. అధికారులు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం ఆలస్యం అవుతున్నదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఆసుపత్రుల పనితీరుపై అసంతృప్తి : ఆసుపత్రుల నిధులన్నీ దాదాపు కేంద్రమే ఇస్తోంది. అయినా రిజల్ట్స్ కనిపించడం లేదు. మెడిసిన్స్ ఇవ్వకపోతే ప్రజలు ఎలా వస్తారు?” అని బండి సంజయ్ ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. “మెడిసిన్ ఖర్చులకు అవసరమైన నిధులను సీఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా తెప్పించడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు.
బ్యాంకుల నిర్లక్ష్యంపై ఆగ్రహం : విశ్వకర్మ, పీఎంఈజీపీ పథకాల కింద రుణాల మంజూరులో బ్యాంకుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, “తనఖా లేకుండా రూ.25 లక్షల లోపు రుణాలు ఇవ్వాలని కేంద్ర గైడ్‌లైన్స్ ఉన్నా ఎందుకు అమలు చేయడం లేదు?” అని బండి సంజయ్ ప్రశ్నించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంటనే చర్యలు తీసుకొని రుణాలు ఇవ్వాలని ఆదేశించారు.
కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు :కలెక్టర్లు వెంటనే శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి, ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. “మాట వినని బ్యాంకుల వద్ద ఉన్న ప్రభుత్వ డిపాజిట్లను వెనక్కు తీసుకోవడాన్ని పరిశీలించండి” అని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : నేను కిందిస్థాయి నుండి ఎదిగిన వాడిని. ఎప్పుడూ నియమాలకు వ్యతిరేకంగా పనిచేయను. కానీ ప్రజా సమస్యల పరిష్కారంపై మేము పంపిన లేఖలకు అధికారులు స్పందించకపోతే సహించం” అని హెచ్చరించారు. ప్రజా సేవలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

