అంబేద్కర్ విగ్రహం తరలిస్తే ఉద్యమం చేపడతాం

— కొద్దిగా వెనక్కి జరిపితే సరిపోతుంది..
— రైల్వే స్థలానికి తరలింపు యత్నం హేయమైన చర్య
— సుంకు వినయ్ కుమార్
— అదే మార్గంలో ఉన్న ఇతర విగ్రహాలు ఎందుకు తరలించడం లేదు…?
— రోడ్డు విస్తరణ పేరుతో రాజ్యాంగ నిర్మాతకు అవమానమా?
— కొందరు ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇచ్చారు
— తప్పుడు సమాచారంతో నిర్ణయం తీసుకోవద్దని ఎమ్మెల్యేకు జిఎంఆర్ కు విజ్ఞప్తి
— అంబేద్కర్ యువజన సంఘం నాయకులు

జ్ఞాన తెలంగాణ రామచంద్రపురం,ఫిబ్రవరి 23:
పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం చౌరస్తాలో ప్రతిష్టించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డు విస్తరణ పేరుతో పూర్తిగా తొలగించే యత్నంపై రామచంద్రాపురం అంబేద్కర్ యువజన సంఘం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రపురం పట్టణంలో సుంకు వినయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు స్పష్టంగా తమ అభ్యంతరాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు తమ సొంత నిధులతో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.ఇది మా ఆత్మగౌరవానికి ప్రతీక. ఇన్నేళ్లుగా నిలిచిన విగ్రహాన్ని ఒక్కసారిగా తొలగించడం అన్యాయమని మండిపడ్డారు.రోడ్డు విస్తరణ లో భాగంగా అవసరమైతే విగ్రహాన్ని కొద్దిగా వెనక్కి జరిపి అదే ప్రదేశంలో పునర్నిర్మించవచ్చని సూచించారు.ఈ సందర్భంగా వారు మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు.కొందరు వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం అందజేశారని ఆరోపించారు.గ్రామస్తులంతా విగ్రహాన్ని తరలించేందుకు అంగీకరించారని చెప్పడం పూర్తిగా అబద్ధం. మా అనుమతి లేకుండా తీసుకునే ఏ నిర్ణయాన్నీ మేము అంగీకరించం.
స్వప్రయోజనాల కోసం కొందరు ఎమ్మెల్యేను తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి విగ్రహాన్ని పూర్తిగా తొలగించి ఇక్రిసాట్ పక్కన ఉన్న రైల్వే భూమికి తరలించడం హేయమని విమర్శించారు.బీరంగూడ నుంచి రామచంద్రాపురం వచ్చే రహదారిలో ఇతర జాతీయ నాయకుల విగ్రహాలు ఉన్నప్పటికీ వాటిని కదిలించకుండా కేవలం అంబేద్కర్ విగ్రహాన్నే తొలగించేందుకు ప్రయత్నించడం అన్యాయమని ప్రశ్నించారు.
ఈ అంశంపై మంత్రి వివేక్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించినప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విగ్రహాన్ని తరలించాలనే వైఖరితో ఉన్నారని ఆరోపించారు.ప్రజల అసలు అభిప్రాయం తెలుసుకునేందుకు ఓపెన్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగితే మౌనంగా ఉండం,అవసరమైతే నిరాహార దీక్షలు, ధర్నాలు చేపడతామని విగ్రహంపై చేయి వేస్తే ఉద్యమం తప్పదు అంటూ హెచ్చరించారు.ఈ సమావేశంలో సుంకు వినయ్ కుమార్, రాజయ్య,కావలి సంజీవ్,మాజీ ఎంపీటీసీ బాల నరసింహ, గంజాయి నరసింహ, సాయికుమార్,నరసింహ, స్వామి, రాజేష్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
