కానిస్టేబుల్ దివ్య మరణం వెనుక సామాజిక ఒత్తిళ్లేనా?

జ్ఞానతెలంగాణ, వికారాబాద్ :
వికారాబాద్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది. కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆమె, ధరూర్ సీఐ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తూ గంగారం సాయిబాబా కాలనీలో నివసిస్తోంది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఘటనాస్థలంలో లభించిన లేఖలో తండ్రి లేమితో కుటుంబం అనేక కష్టాలు ఎదుర్కొన్నదని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని పేర్కొన్నట్లు సీఐ రఘుకుమార్ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఆదివారం జరగాల్సిన పెండ్లి చూపులు ఆమెకు ఇష్టం లేకపోవడం, అదే విషయంపై ఇంట్లో జరిగిన చర్చలు మానసిక ఆందోళనకు దారితీసినట్లు సమాచారం. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌తో వివాహం ప్రతిపాదనను ఆమె నిరాకరించినప్పటికీ, కుటుంబం ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అలాగే పోలీస్ ఉద్యోగంపై అసంతృప్తి, రాత్రి డ్యూటీల భయం వంటి అంశాలు ఆమె మానసిక స్థితిని దెబ్బతీసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషాదం కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదా? లేక సామాజిక, కుటుంబ, వృత్తి ఒత్తిళ్ల సమ్మేళన ఫలితమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహిళా సిబ్బందికి మానసిక ఆరోగ్య సహాయం, కౌన్సెలింగ్ వ్యవస్థల బలోపేతం అత్యవసరమనే అవసరాన్ని ఈ ఘటన మళ్లీ గుర్తు చేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అసలు కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

You may also like...

Translate »