ఫిరాయింపుల రాజకీయం-రాజ్యాంగానికి సవాల్

  • స్పీకర్ మౌనం, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై కేటీఆర్ ఘాటు విమర్శలు
  • కోటి సాక్ష్యాలున్నా చర్యలేమి..?
  • ఫొటోలు, వీడియోలు, ట్వీట్లు అన్నీ స్పష్టమే
  • ప్రజల తీర్పును ఖూనీ చేస్తున్న పాలకులు
  • స్పీకర్ రాజ్యాంగ అధికారి లేదా పార్టీ ప్రతినిధి?
  • రాజ్యాంగ రక్షణ మాటలు.. రాజకీయాల్లో దొంగనాటకం
  • రేవంత్ రెడ్డి మాటలకు సిగ్గుందా?
  • ప్రజల తీర్పు తప్పదు – చరిత్ర క్షమించదు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల అంశం మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యేలు పార్టీలు మారినట్లు కోటి సాక్ష్యాలు, బహిరంగ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు, వేదికలపై జరిగిన సంఘటనలు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన రాజ్యాంగబద్ధ అధికారి అయిన స్పీకర్ మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ఇది కేవలం రాజకీయ అంశం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా మారిందని స్పష్టంచేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీతో కండువాలు కప్పించుకున్నామని స్వయంగా చెప్పడం, ఆయన చేతుల మీదుగా పుష్పగుచ్ఛాలు అందుకోవడం, ఫలానా ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్‌లు చేయడం—ఇవన్నీ జరిగినప్పటికీ స్పీకర్ మాత్రం “నాకు ఏమీ కనిపించడం లేదు, ఏమీ తెలియడం లేదు” అన్నట్టుగా మౌనం వహించడం ప్రజాస్వామ్యంపై వ్యంగ్యమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్పీకర్ తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, ఇది వ్యవస్థల పతనానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.

కేటీఆర్ విమర్శలు కేవలం వ్యక్తులకే పరిమితం కాలేదు. రాజ్యాంగ పరిరక్షణ గురించి రోజూ ఉపన్యాసాలు ఇచ్చే రాహుల్ గాంధీకి ఈ ఫిరాయింపులు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఉదయం లేస్తే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఫోజులు కొట్టే నాయకుడిగా ప్రచారం చేసుకునే రాహుల్ గాంధీ, తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వంలో ఫిరాయింపుల చట్టం ఎలా ఉల్లంఘనకు గురవుతోందో చూడలేకపోతున్నారా? లేక చూడాలనుకోవడం లేదా? అని నిలదీశారు. ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన రాజీవ్ గాంధీ ఈ పరిస్థితిని చూస్తే ఆత్మక్షోభిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది.

ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశం స్పష్టమైనదే. ప్రజలు ఓ పార్టీకి ఓ సిద్ధాంతానికి ఓ విధానానికి ఓటు వేస్తారు. ఎన్నికైన తరువాత వ్యక్తిగత లాభాల కోసం పార్టీ మారితే అది ప్రజల తీర్పును తుంగలో తొక్కినట్టే. అటువంటి సందర్భాల్లో స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించి తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని కేటీఆర్ ఆరోపించారు. స్పీకర్ కార్యాలయం రాజ్యాంగ సంస్థగా కాకుండా, అధికార పార్టీ అనుబంధ విభాగంలా మారిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని కూడా ఆయన ఎండగట్టారు. విపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రజాస్వామ్య హత్యగా వర్ణించిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే అదే పనిని బహిరంగంగా చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. “ఈ ఇంటి కాకీ ఆ ఇంటి మీద వాలొద్దు” అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు సిగ్గు లేదా? కనీసం సోయి లేదా? అబద్ధాలు చెప్పడానికి కూడా ఇంగితం ఉండాలి కదా? అని కేటీఆర్ ఘాటుగా నిలదీశారు. అధికారంలోకి రావడానికి ముందు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు మధ్య పొంతన లేకపోవడం కాంగ్రెస్ రాజకీయాల అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని విమర్శించారు.

సోషల్ మీడియా, వీడియోలు, ఫొటోలు, బహిరంగ సభలు అన్నీ సాక్ష్యాలుగా ఉన్నా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకపోవడం ద్వారా స్పీకర్ రాజ్యాంగ బాధ్యతలను విస్మరిస్తున్నారని, ఇది చట్టపరంగా కూడా సవాలుగా మారుతుందని హెచ్చరించారు. న్యాయస్థానాలు ఇప్పటికే పలు సందర్భాల్లో స్పీకర్ల ఆలస్య నిర్ణయాలను తప్పుబట్టిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు.

ప్రజాస్వామ్యంలో స్పీకర్ పాత్ర అత్యంత కీలకమైనది. సభలో అధికార, విపక్షాల మధ్య సమతుల్యత పాటించాల్సిన బాధ్యత ఆయనదే. కానీ తెలంగాణలో ఆ పాత్ర నిర్వీర్యమైందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. స్పీకర్ మౌనం వల్ల ప్రజల్లో రాజ్యాంగంపై విశ్వాసం దెబ్బతింటోందని, ఇది దీర్ఘకాలంలో ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ప్రజలు చూస్తున్నారని, చరిత్ర కూడా చూస్తుందని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడటం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు మరిచిపోవద్దని కేటీఆర్ సూచించారు. మాటలు ఒకటైతే పనులు మరోలా ఉంటే ప్రజలు ఎప్పటికైనా తేల్చి చెబుతారని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలు, నైతిక రాజకీయాలు అన్నీ నినాదాలకే పరిమితమైతే దేశం ఏ దిశగా వెళ్తుందన్న ప్రశ్నను కేటీఆర్ ముందుంచారు.

You may also like...

Translate »