చేవెళ్ల బీజాపూర్ రోడ్డు లో కొనసాగుతున్న మారణకాండ

చేవెళ్ల బీజాపూర్ రోడ్డు లో కొనసాగుతున్న మారణకాండ
- రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
- పొద్దుటూరు గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులుగా గుర్తింపు
- వందలాది కుటుంబాలకు కాలరాత్రి ని మిగులుస్తున్న చేవెళ్ల బీజాపూర్ రోడ్డు
- పడమటి రంగారెడ్డి జిల్లా రోడ్లను పట్టించుకోని ప్రభుత్వాలు
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: చేవెళ్ల బీజాపూర్ రోడ్డు మరోసారి రక్తపాతం సృష్టించింది. చేవెళ్ల మీదుగా వికారాబాద్ వైపు, తమ బందువుల వద్దకు కారులో ప్రయాణిస్తున్న, పొద్దుటూరు గ్రామానికి చెందిన దంపతులు దుర్మరణం చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దావణం లా వ్యాపించింది. చేవెళ్ల నియోజకవర్గం, శంకర్ పల్లి మండలం, పొద్దటూర్ గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులు ఆదివారం చేవెళ్ల బీజాపూర్ రోడ్డు గుండా తమ కారు లో తమ బంధువుల వద్దకు వెళుతుండగా మీర్జాపూర్ గేట్ వద్దకు రాగానే దాదాపు 12 గంటల 45 నిమిషాల సమయంలో తన ముందర ఉన్న లారీని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో, సమన్వయ లోపంతో ఎదురుగా వచ్చిన మరో లారీని బలంగా ఢీకొట్టిన కారు నుజ్జు నుజ్జయ్యింది. ఈ హఠాత్పరిణామం లో తోటి వాహన దారులు చూస్తుండగానే, కారులో ఉన్న మహిళ పక్కనే ఉన్న పొదల్లో ఎగిరిపడి అక్కడికక్కడే, క్షాణాల వ్యవధిలో ప్రాణాలు వదిలింది. కారు ఇరుక్కుపోయిన వ్యక్తిని వాహనదారులు బయటకు తీశారు. సమాచార మందుకున్న చేవెళ్ల పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వారిద్దరిని అంబులెన్స్ లో చేవెళ్ల ప్రభుత్వ హస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న కొన్ని నిమిషాల వ్యవధి లోనే కారు నడిపిన వ్యక్తి కూడా మరణించాడు. మృతులు శంకర్ పల్లి మండలం, పొద్దుటూరు గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి బిడియల్ ఉద్యోగి, మేకల భాగ్యలక్ష్మి లు గా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం చేవెళ్ల పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు వారి పార్థివ దేహాలను అప్పగించారు. చేవెళ్ల బీజాపూర్ రోడ్డు లో ప్రమాదాల బారిన పడి వందలాదిగా ప్రయాణికులు చనిపోయారని, ఎన్నో కుటుంబాలకు ఈ రోడ్డు కాలరాత్రి ని మిగిల్చిందని స్థానికులు అంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పడమటి రంగారెడ్డి జిల్లా రోడ్లను పట్టించుకోవడంలేదని ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.



