కన్నతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

కన్నీరు మున్నీరైన ఎంచగూడెం


మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఏ తండ్రైనా తన కూతురు పసుపు పారాణి కాళ్లతో పెళ్లి పీటలు ఎక్కి, మహాలక్ష్మిలా మరో ఇంటికి అడుగుపెడుతుంటే చూడాలని కలలు కంటాడు. కానీ విధి వక్రించింది. పెళ్లి మండపం చూడాల్సిన ఆ కూతురు, కన్నతండ్రి చితికి నిప్పంటించే బాధ్యతను మోసింది. ఈ దృశ్యం గ్రామస్తుల హృదయాలను కదిలించింది.

గ్రామానికి చెందిన గుజ్జ కమలాకర్ రావు ములుగు జిల్లా మేడారం వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆకస్మిక ప్రమాదంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబానికి ఆధారంగా నిలిచిన వ్యక్తి ఒక్కసారిగా దూరమవ్వడం అందరినీ విషాదంలో ముంచింది.

సాంప్రదాయంగా హిందూ ఆచారాల ప్రకారం కుమారులు అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే కమలాకర్ రావుకు కుమారులు లేకపోవడంతో ఆయన గారాలపట్టి కూతురు రస్మితే ముందుకొచ్చింది. కన్నీళ్లు ఆగకపోయినా, గుండె నిండా వేదన ఉన్నా ధైర్యం చేసి తండ్రికి తలకొరివి పెట్టింది. ఆ క్షణం అక్కడున్న వారందరి కళ్లలో నీళ్లు తెప్పించింది. ఒక కూతురు తన తండ్రికి ఇచ్చిన ఆ చివరి వీడ్కోలు గ్రామమంతా ద్రవింపజేసింది.

ఎంచగూడెం గ్రామం మొత్తం ఈ ఘటనతో శోకసంద్రంలో మునిగిపోయింది. తండ్రి–కూతురు అనుబంధానికి నిలువెత్తు ఉదాహరణగా ఈ ఘటన నిలిచిపోయింది. విధి ఎంత క్రూరమో, బంధం ఎంత బలమో ఒకేసారి చూపించిన ఈ విషాదం గ్రామస్తుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

You may also like...

Translate »