విద్యార్థులు లేని స్కూళ్లలో తెలంగాణకు రెండో స్థానం

విద్యార్థులు లేని స్కూళ్లలో తెలంగాణకు రెండో స్థానం
– రాష్ట్రంలో 2,245 బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని వెల్లడి
– ఈ స్కూళ్లలో 1,016 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్టు గుర్తింపు
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 27:
ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేలకొద్దీ ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరడం లేదన్న చేదు నిజాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలల్లో ‘జీరో ఎన్‌రోల్‌మెంట్’ నమోదైందని కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం, విద్యార్థులు లేని పాఠశాలల జాబితాలో పశ్చిమబెంగాల్ 3,812 స్కూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ 2,245 పాఠశాలలతో రెండో స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే, విద్యార్థులు లేని ఈ స్కూళ్లలో దేశవ్యాప్తంగా 20,817 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 17,965 మంది ఉండగా, తెలంగాణలో 1,016 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలకు కేటాయించబడ్డారు. తెలంగాణ తర్వాతి స్థానాల్లో హర్యానా, మహారాష్ట్ర, గోవా, అసోం, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
అయితే, గతేడాదితో పోలిస్తే ఈ పరిస్థితి కొంత మెరుగుపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలల సంఖ్య 12,954గా ఉండగా, ఈ ఏడాదికి ఆ సంఖ్య సుమారు 5,000 తగ్గడం కొంత సానుకూల అంశంగా భావిస్తున్నారు. మరోవైపు, ఢిల్లీతో పాటు ఏ ఇతర కేంద్రపాలిత ప్రాంతంలోనూ జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
