తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేత..

తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేత..
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదె బ్బ తగిలింది. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ‘ 57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలింది. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్ ఎందుకు?, బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదు.
గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుంది. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏజీ సుదర్శన్ రెడ్డి. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణాను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనుంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించినది. మేం రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో తెచ్చాం’ అని వివరించారు.