వికారాబాద్లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
- నివాసంలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన
- విధుల నిర్వహణ, ఇటీవల బదిలీ పై అనుమానాలు
- సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం
- అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :
వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకున్న మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం పోలీసు వ్యవస్థను కుదిపేసే విధంగా మారింది. ప్రజల రక్షణ బాధ్యతలు భుజాన వేసుకుని సేవలందిస్తున్న ఓ మహిళా పోలీసు సిబ్బంది ఇలా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున వెలుగులోకి రావడంతో పట్టణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న బలిజ దివ్య కోట్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తోంది. ఇటీవల ఆమెను ధారూర్ సీఐ కార్యాలయానికి అటాచ్ చేయడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే అనూహ్యంగా శనివారం ఉదయం తన నివాసంలోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దివ్య సూసైడ్ నోట్ రాసి ఉంచినట్లు ప్రాథమిక సమాచారం వెలువడుతోంది. ఆ నోట్లో ఏముంది? వ్యక్తిగత ఒత్తిడులా? విధుల్లో మానసిక భారం? లేక మరేదైనా కారణమా? అనే ప్రశ్నలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసు శాఖలో విధుల నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడులు, అంతర్గత సమస్యలు, మానసిక ఆందోళనలు ఎంతటి తీవ్రతకు దారితీస్తున్నాయో ఈ ఘటన స్పష్టంగా సూచిస్తోంది.
ప్రజలకు ధైర్యం చెప్పే వృత్తిలో ఉన్న సిబ్బందే తమ అంతరంగ వేదనను మౌనంగా మోస్తూ చివరకు ప్రాణత్యాగం చేయాల్సి రావడం ఆందోళనకరం. ఈ విషాదం కేవలం ఒక కుటుంబానిదే కాదు, మొత్తం పోలీసు వ్యవస్థకు తలవంచే పరిస్థితి. మానసిక ఆరోగ్యంపై అవగాహన, విధుల్లో ఒత్తిడి నియంత్రణ, సిబ్బందికి సైకాలజికల్ కౌన్సెలింగ్ వంటి చర్యలు అత్యవసరమనే సంకేతాన్ని ఈ ఘటన ఇస్తోంది.
దివ్య మృతిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్లోని వివరాలు, ఫోన్ కాల్ రికార్డులు, సహచరుల వాంగ్మూలాలు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి వచ్చే వరకు అనేక ప్రశ్నలు మిగిలే అవకాశముంది. మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం సమాజాన్ని కలచివేసే విషాద ఘట్టంగా నిలిచింది
