గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్‌లో పలు సేవింగ్స్ పథకాలు

గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్ ద్వారా గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ పలు సేవింగ్స్ మరియు బీమా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో పొదుపు అలవాటు పెంపొందించడం, ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని బ్రాంచ్ పోస్టుమాస్టర్ జి. భానుప్రకాశ్ తెలిపారు.
పోస్టాఫీస్‌లో సేవింగ్స్ బ్యాంక్ (SB) ఖాతా, రికరింగ్ డిపాజిట్ (RD), సుకన్య సమృద్ధి అకౌంట్ (SSA), టైమ్ డిపాజిట్ (TD), ఫిక్స్డ్ డిపాజిట్ వంటి పలు పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ పథకాలలో పెట్టుబడులు పెట్టి భవిష్యత్‌కు భద్రతను కల్పించుకోవచ్చన్నారు.
అదేవిధంగా బీమా సేవల్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI) ప్రభుత్వ ఉద్యోగులు మరియు పట్టభద్రులకు, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇక పోస్టాఫీస్‌లో స్పీడ్ పోస్టు, పార్సిల్ సేవలు, పోస్టల్ స్టాంపులు కూడా లభ్యమవుతున్నాయని చెప్పారు. పోస్టాఫీస్ అనేది కేవలం లేఖల పంపిణీ కేంద్రం మాత్రమే కాకుండా బ్యాంకింగ్ సేవలు, డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ వంటి ఆర్థిక సేవలను అందించే కేంద్ర ప్రభుత్వ కార్యాలయమని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
