పైసా ఉన్నవారికే ప్రాముఖ్యత.. నిచ్చారు…,

  • సేవ చేసిన నన్ను పక్కన పెట్టారు
  • డబ్బు పెట్టే వారిని కాదు నిజంగా పని చేసే అభ్యర్థిని ఎన్నుకోండి
  • స్వతంత్రంగా బరిలోకి దిగిన నాని స్వాతి రత్నం
  • హృదయవేదన

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ప్రొద్దుటూరు గ్రామం శంకర్‌పల్లి మండల సర్పంచ్‌ పదవి ఈసారి మహిళల ఎస్సీ రిజర్వేషన్‌కు వచ్చిన నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాని స్వాతి రత్నం గ్రామ ప్రజలకు భావోద్వేగపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఇతరుల గెలుపుకోసమే సాగిందని, గ్రామ ప్రజల కోసం పనిచేసే నాయకులను ముందుకు తేవడంలో తన పాత్ర చిన్నది కాదని గుర్తుచేశారు.

“2006లో శ్రీనివాస్ గారు, 2013లో బొల్లారం వెంకట్ రెడ్డి గారు, 2018లో నరసింహారెడ్డిగారిని గెలిపించడానికి నేను చేసిన కష్టం మీరందరూ చూసినదే. ఆ ముగ్గురి గెలుపులో నా శ్రమ బంధువులా, నా నిబద్ధత బలంలా నిలిచింది. వారు నాకు నాయకులు మాత్రమే కాదు… నా రాజకీయ కుటుంబమే. వారి నుంచి నాకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు వారి అభిమానులు కూడా నన్ను ఆశీర్వదించాలని నేను వినయపూర్వకంగా కోరుతున్నాను” అని స్వాతి రత్నం ప్రజల ద్వారా విజ్ఞప్తి చేశారు.

డబ్బున్నవారిని మాత్రమే ముందుకు తెస్తున్న రాజకీయ ధోరణి తనలాంటి నిజాయితీతో సేవ చేయాలనుకునే వారిని పక్కనబెడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “డబ్బులు లేవని నన్ను వదిలేశారు… కానీ నా దగ్గర డబ్బు కన్నా విలువైనది ఉంది — గ్రామాభివృద్ధి చేయాలన్న నిజమైన మనసు, నిబద్ధత. నేను అధికారానికి కాదు… సేవ కోసం మీ ముందుకు వచ్చాను” అని స్పష్టం చేశారు.

తనలో సేవా భావం ఎలా పెరిగిందో కూడా ఆయన అభివర్ణించారు. “నేను విద్యార్థిగా ఉన్నప్పుడే మన గ్రామానికి ఎంతో సేవ చేసిన కె. చంద్రమోహన్ రెడ్డి గారి పాలనను చూసి పెరిగాను. ఆయన ప్రజల కోసం ఎలా పనిచేశారో, గ్రామం కోసం ఎలా ఆలోచించారో చూస్తూ నేర్చుకున్న మంచి విలువలు నన్ను ఈ స్థాయి వరకు తీసుకువచ్చాయి. ఆయన చూపించిన మార్గమే నాకు ప్రేరణ” అని చెప్పారు.

“నాయకులు నన్ను వదిలినా… గ్రామ ప్రజలు నన్ను ఎప్పుడూ వదిలరని నమ్మకం ఉంది. గతంలో ఇతరుల కోసం నేను తిరిగాను… ఇప్పుడు మీ కోసం, మీ అభివృద్ధి కోసం, నా కోసం కాదు—గ్రామం కోసం అడుగుతున్నాను. ఈసారి గెలవాలంటే మీ ఒక్కో ఓటు ఆశీర్వాదం చాలా అవసరం. మీరందరూ ఆశీర్వదిస్తే నిజమైన మార్పు తెచ్చే సర్పంచ్‌గా పనిచేస్తాను” అని స్వాతి రత్నం విజ్ఞప్తి చేశారు.

“డబ్బు పెట్టుకునే వారిని కాదు… నిజంగా పని చేసే అభ్యర్థిని ఎన్నుకోండి. మీ ఆశీర్వాదం నన్ను నిలబెడుతుంది. మన గ్రామానికి పని చేసే అవకాశం ఇవ్వండి” అని ఆయన గ్రామ ప్రజలను కోరారు.

You may also like...

Translate »