హాస్టల్ ను ఆకస్మిక తనికి చేసిన జిల్లా కలెక్టర్

- వంటల రుచి చూసి అసహనం
- సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకూడదు
- విద్యార్థులు సెల్ ఫోన్ లకు దూరంగా ఉండండి
- సమయం చాలా విలువైంది గుర్తుంచు కోండి
- విద్యార్థులు కస్టపడి చదివితే మీదే మంచి భవిష్యత్తు
- జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జులై 24 :
సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు.
బుధవారం సాయంత్రం మహేశ్వరంలోని జ్యోతి రావు పూలే బీసీ వెల్ఫేర్, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆకస్మిక తనికి చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ హాస్టల్ లో బియ్యం, కూరగాయలు, సరుకులు నిల్వ ఉంచిన గదిని, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. విద్యార్థులకు వండిన కూరలను రుచి చేసి మజ్జిగ నాణ్యతగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. స్టోరేజ్ గదిని, విద్యార్థుల గదులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, ముఖ్యంగా అదనంగా స్కావెంజర్ ను నియమించి మరుగుదొడ్లు శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మహేశ్వరం ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదువు ఒక ఆయుధమని, ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉండాలని, కష్టపడి చదువుకుంటే జీవితంలో స్థిర పడవచ్చని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. తల్లి తండ్రులు ఎంతో కష్ట పడతారని, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మీరంతా చదువును ఎట్టి పరిస్థితుల్లో ను వదలొద్దని అన్నారు. సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని, సమయం చాలా విలువైనదని కలెక్టర్ విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా వసతి గృహానికి సోలార్, కిటికీలకు లాక్ లేదని, డైనింగ్, స్టడీ హాల్ కావాలని విద్యార్థినిలు కలెక్టర్ దృష్టికి తేగా, ఆయన వెంటనే స్పందిస్తూ త్వరలోనే వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట అసిస్టెన్స్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లావణ్య, మహేశ్వరం తహసీల్దార్ సైదులు, ఎంపిడిఓ శైలజ, తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్ వాణి, బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపల్ సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.

