మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత

- ఎమ్మెల్యే కాలె యాదయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రాంతానికి చేరుకోగానే ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆవేదనతో ఉన్న స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాద స్థలానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు రాళ్లు ఎత్తుకున్నారు. “కాలె యాదయ్య డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రాంతంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా, రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం అవుతున్నాయని ప్రజలు మండిపడ్డారు. గతంలో కూడా అనేక సార్లు విన్నపాలు చేసినా స్పందన రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలు రోడ్డుపై బస్సును తొలగించవద్దని డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించగా, పరిస్థితి నియంత్రణలో లేకపోవడంతో కాలె యాదయ్య కారు ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయారు.
