శంకర్‌పల్లి మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

▪️ 15 వార్డులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్లు
▪️ అనుకున్న అంచనాలు తలకిందులు… ఆశావహుల్లో గందరగోళం
▪️ మహిళా రిజర్వేషన్లతో పెరిగిన మహిళా నాయకత్వ అవకాశాలు
▪️ రిజర్వేషన్లు ఖరారుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది
▪️ గల్లీ గల్లీకి చర్చలు… దావతులతో ఊపందుకున్న ఎన్నికల హీట్
శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 15 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. చాలా రోజులుగా రిజర్వేషన్లపై స్పష్టత లేక గందరగోళ పరిస్థితులు నెలకొనగా, తాజా ప్రకటనతో ఆ అనిశ్చితికి తెరపడింది. రిజర్వేషన్ జాబితా వెలువడడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివిధ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు కొందరు ఆశావహుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తే, మరికొందరిలో నిరాశను మిగిల్చాయి.
రిజర్వేషన్ వివరాల ప్రకారం 1వ వార్డు ఎస్సీ జనరల్‌కు, 2వ వార్డు జనరల్ మహిళకు, 3వ వార్డు బీసీ మహిళకు కేటాయించారు. 4వ వార్డు జనరల్ మహిళకు, 5వ వార్డు బీసీ జనరల్‌కు, 6వ వార్డు ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. 7వ వార్డు ఎస్సీ జనరల్‌కు, 8వ వార్డు జనరల్ మహిళకు కేటాయించగా, 9వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. అలాగే 10వ వార్డు జనరల్ మహిళకు, 11వ వార్డు జనరల్ మహిళకు, 12వ వార్డు జనరల్‌కు కేటాయించారు. 13వ వార్డు బీసీ జనరల్‌కు, 14వ వార్డు జనరల్‌కు, 15వ వార్డు కూడా జనరల్‌కు రిజర్వ్ చేయడం జరిగింది.
మొత్తం వార్డుల్లో మహిళలకు గణనీయమైన ప్రాధాన్యం ఇవ్వడం విశేషంగా నిలిచింది. మహిళా రిజర్వేషన్లతో శంకర్‌పల్లి మున్సిపాలిటీలో మహిళా నాయకత్వానికి మరింత అవకాశం లభించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. సామాజిక సమతుల్యత దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇన్నాళ్లుగా రిజర్వేషన్లపై స్పష్టత లేక ఆశావహులు అయోమయంలో ఉన్నారు. ఎవరి అంచనాలు వారికి ఉండగా, అనుకున్న రిజర్వేషన్లలో మార్పులు రావడంతో పలువురి ఆలోచనలు తలకిందులయ్యాయి. దీంతో కొందరు ఆశావహులు తర్జనభర్జనలో పడ్డారని స్థానికంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు ఖరారయ్యాక ఎవరు పోటీ చేయాలి, ఎవరు తప్పుకోవాలి అన్న విషయాలపై ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు.
రిజర్వేషన్ల ప్రకటనతో శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే ఆశావహులు తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ, ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కొన్ని వార్డుల్లో దావతులు మొదలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఆశావహులు తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
ఎక్కడ చూసినా “ఎవరు గెలుస్తారు?” అన్న చర్చే వినిపిస్తోంది. గల్లీ గల్లీకి గుసగుసలు, రాజకీయ అంచనాలు సాగుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికలు శంకర్‌పల్లిలో ఆసక్తికరంగా, హోరాహోరీగా సాగనున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్లతో మొదలైన ఈ రాజకీయ వేడి ఎన్నికల వరకు మరింత ఉధృతం కానుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
