ప్రధాని మాతృమూర్తిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు – బీజేపీ తీవ్ర ఆగ్రహం

  • కాంగ్రెస్ అసభ్య సంస్కారానికి నిదర్శనం – జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి
  • వెంటనే రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి

శంకర్ పల్లి, జ్ఞాన తెలంగాణ:
బిహార్‌లో ఓటర్ అధికార యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి డిమాండ్ చేశారు.

“సాక్షాత్తు దేశ ప్రధాని తల్లిని రాజకీయ వేదికపై అవమానించడం సిగ్గుచేటు. ఇలాంటి వ్యాఖ్యలు ఒకవేళ సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీపై జరిగితే రాహుల్ గాంధీ ఊరుకుంటారా? ఆయన స్వయంగా వీధుల్లోకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసేవారు. మరి ప్రధాని గౌరవాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ నాయకత్వానికి లేదా?” అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ పదే పదే అవమానకర వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆయన విమర్శించారు. ఇలాంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీ కే సిగ్గు చేటని, ప్రజల గౌరవం, దేశ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన రాహుల్ గాంధీని క్షమించరాని నేరస్థుడిగా చూడాలని డిమాండ్ చేశారు.

“ఈ ఘటనపై కేవలం మాటలకే పరిమితం కాకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. రాహుల్ గాంధీతో పాటు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి చట్టపరమైన శిక్షలు విధించాలి. ఈ రోజు ప్రధాని తల్లిపై దుర్భాషలాడితే, రేపు దేశంలోని సాధారణ ప్రజల తల్లులపై కూడా ఇలాంటి మాటలు వాడే పరిస్థితి వస్తుంది” అని ఆయన హెచ్చరించారు.

“ప్రధాని మాతృమూర్తిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం దేశ గౌరవాన్ని అవమానించడమే. ఇది కేవలం ఒక వ్యక్తిగత అవమానం కాదు, దేశ ప్రజలందరికీ జరిగిన అవమానమని” ఆయన స్పష్టం చేశారు. అందుకే రాహుల్ గాంధీపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన బహిరంగంగా డిమాండ్ చేశారు.

ఇకపై ఈ అంశంపై బీజేపీ తరఫున జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేసి, ప్రజా మద్దతుతో కాంగ్రెస్ నేతల అసభ్య సంస్కారాన్ని ఎదుర్కొంటామని, భారతీయ జనతా పార్టీ, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి తీవ్రంగా హెచ్చరించారు.
repu web lo pedadham

You may also like...

Translate »